Mahaa Daily Exclusive

  ఆపరేషన్ సిందూర్’ అమరులకు సగర్వ నివాళి…

Share

ఆపరేషన్ సిందూర్’ అమరులకు సగర్వ నివాళి.
*జాతీయ యుద్ధ స్మారకంలో ఆరుగురు వీరజవాన్ల పేర్లు.
*ప్రాణత్యాగం చేసిన వారిలో తెలుగు బిడ్డ అగ్నివీర్ మురళీ నాయక్.
*అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
ఢిల్లీ, మహా.
మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలు అజరామరమైనవి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా వెల్లడించింది. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన ఈ భరతమాత ముద్దుబిడ్డల పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారకం) అధికారిక వెబ్‌సైట్‌లో సగర్వంగా పొందుపరిచింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఒక అగ్నివీర్ వీరమరణం పొందారు. ఈ వీరుల సాహసగాథలను భావితరాలు స్మరించుకునేలా, న్యూదిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రత్యేక గ్రానైట్ శిలలపై వీరి పేర్లను పదిలం చేయనున్నారు. శత్రువుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన వీరిలో ఇద్దరికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత శౌర్య పురస్కారాలను ప్రకటించింది. అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన రైఫిల్‌మన్ సునీల్ కుమార్‌కు మరణానంతరం ‘వీర్ చక్ర’ పురస్కారం వరించగా, భారత వైమానిక దళానికి చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్‌ను ‘వాయు పతకం’తో సత్కరించారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఈ ఆరుగురు అమరవీరుల్లో తెలుగు బిడ్డ ఉండటం గమనార్హం. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ, పాకిస్థాన్ మూకలతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ తన ప్రాణాలను పణంగా పెట్టి అలుపెరగని పోరాటం చేశారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన అమరవీరుల జాబితాలో 10 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, జమ్ముకశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ 4వ బెటాలియన్ జవాను రైఫిల్‌మన్ సునీల్ కుమార్, 5 ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు. వారితో పాటు 851 లైట్ రెజిమెంట్‌కు చెందిన తెలుగు తేజం అగ్నివీర్ మురళీ నాయక్, 237 ఫీల్డ్ వర్క్‌షాప్‌నకు చెందిన హవీల్దార్ సునీల్ కుమార్ సింగ్, భారత వైమానిక దళం 39 వింగ్‌కు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్‌ల పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి, వారి త్యాగాలకు ఘన నివాళి అర్పించింది.