Mahaa Daily Exclusive

  రామ మందిర విరాళాల కేసులో కీలక మలుపు….

Share

రామ మందిర విరాళాల కేసులో కీలక మలుపు.
* ఎనిమిది మంది నిందితుల అరెస్టు.
* సనాతన ధర్మంతో చెలగాటమాడితే సహించేది లేదు.
* సీఎం యోగి ఆదిత్యనాథ్.
లక్నో,మహా.
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. సుమారు ఏడు కోట్ల రూపాయల మేర జరిగినట్లు భావిస్తున్న ఈ కుంభకోణంలో ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గురువారం రాత్రి అయోధ్యలో అరెస్టు చేశారు.

**దర్యాప్తు వేగవంతం..**

ఈ నెల ప్రారంభంలో విరాళాల నిధుల మళ్లింపు ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తొలుత ఆ వార్తలను ఖండించారు. అయితే, వివాదం ముదరడంతో ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. జూన్ 23న సిట్ తన ప్రాథమిక నివేదికను సమర్పించిన రెండు రోజులకే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) నిబంధనల ప్రకారం దొంగతనం (సెక్షన్ 306), క్రిమినల్ నమ్మకద్రోహం (సెక్షన్ 316), దొంగిలించిన ఆస్తిని కలిగి ఉండటం (సెక్షన్ 317), నేరపూరిత కుట్ర (సెక్షన్ 61) తదితర సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

**తెరవెనుక సూత్రధారులు వీరే..**

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం అరెస్ట్ అయిన ఎనిమిది మంది విరాళాల లెక్కింపులో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఈ వ్యవహారంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వద్ద మాజీ డ్రైవర్‌గా పనిచేసిన రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ ప్రధాన సూత్రధారిగా వెలుగులోకి వచ్చాడు. విరాళాల పెట్టెల తాళాలు అతని వద్దే ఉండటంతో పాటు, ట్రస్ట్ సభ్యులకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. నగదు లెక్కింపు సిబ్బందికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన మాజీ బ్యాంకు ఉద్యోగి సుభాష్ శ్రీవాస్తవతో పాటు మరో సిబ్బంది రామశంకర్ మిశ్రా అలియాస్ రవి మిశ్రా కూడా ఈ కుట్రలో పాలుపంచుకున్నారు.
రామశంకర్ మిశ్రా ఏకంగా తన కుమారుడు అనుకల్ప్ మిశ్రాతో పాటు అల్లుడు లవకుష్ మిశ్రాను కూడా ఈ అక్రమాల్లోకి దించాడు. అనుకల్ప్ మిశ్రా ట్రస్టీ అనిల్ మిశ్రాకు బంధువు కావడం గమనార్హం. దుర్వినియోగం చేసిన డబ్బును దాచిన లవకుష్ మిశ్రా ఇంట్లో సోదాలు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రధాన నిందితుడు టిన్ను యాదవ్ మేనల్లుడు మనీష్ కుమార్ యాదవ్ ఇంటి నుంచి కూడా దొంగిలించిన సొమ్మును పోలీసులు రికవరీ చేశారు. ఈ సిండికేట్‌లో కీలక సభ్యుడైన ఆలయ అటెండెంట్ అవినాష్ శుక్లా బ్యాంకు ఖాతా నుంచి ఐదు లక్షల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఇక విరాళాల రశీదులలో అవకతవకలకు పాల్పడిన కరుణేష్ పాండేను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

**ఎవరినీ వదిలిపెట్టం**
సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అటువంటి పవిత్రమైన విశ్వాసంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు.” **- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం**

అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. యూపీలోని దేవరియాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల మతపరమైన సెంటిమెంట్లతో, నమ్మకాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.