Mahaa Daily Exclusive

  రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార జ్వాల.. ఏకంగా 660 డ్రోన్లతో భీకర దాడి…

Share

రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార జ్వాల.. ఏకంగా 660 డ్రోన్లతో భీకర దాడి.
* ఇంధన, చమురు క్షేత్రాలే లక్ష్యంగా విరుచుకుపడ్డ కీవ్ బలగాలు.. 12 రష్యా ప్రాంతాల్లో కలకలం.
మాస్కో,మహా.
రష్యా, ఉక్రెయిన్ మధ్య రగులుతున్న యుద్ధం నాలుగేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. అగ్రరాజ్యం అమెరికా ఆధ్వర్యంలో జరిగిన శాంతి చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఉక్రెయిన్ దాడుల తీవ్రతను అమాంతం పెంచేసింది. ఇందులో భాగంగానే రష్యా భూభాగంపై కనీవినీ ఎరుగని రీతిలో డ్రోన్ల వర్షం కురిపించింది. రాత్రికి రాత్రే ఏకంగా 660 డ్రోన్లతో విరుచుకుపడి మాస్కో వెన్నులో వణుకు పుట్టించే ప్రయత్నం చేసింది.
నల్ల సముద్రం, అజోవ్ సముద్ర జలాల పరిసరాలతో పాటు రష్యాలోని మొత్తం 12 కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దళాలు ఈ ఆకస్మిక దాడులకు దిగాయి. అయితే, శత్రు దేశం ప్రయోగించిన ఈ మానవరహిత వైమానిక వాహనాలను (డ్రోన్లను) తమ వాయు రక్షణ వ్యవస్థలు సమర్థమంతంగా తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్ చరిత్రలో చేపట్టిన అత్యంత భారీ డ్రోన్ దాడుల్లో ఇది ఒకటని రక్షణ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడిలో రష్యాలోని ఓ రసాయన కర్మాగారం తీవ్రంగా దెబ్బతిందని, ఒక మహిళ సైతం గాయపడిందని స్థానిక గవర్నర్ అధికారికంగా ధ్రువీకరించారు.
ముఖ్యంగా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా ఉక్రెయిన్ తాజా వ్యూహాలను రచిస్తోంది. పుతిన్ సర్కారుకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంధన, చమురు రంగాలపై గురిపెట్టి ఈ ఆపరేషన్లను ముమ్మరం చేసింది. చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలను ధ్వంసం చేయడం ద్వారా రష్యాకు యుద్ధ నిధులు అందకుండా చేయాలని కీవ్ గట్టి పట్టుదలతో ఉంది.
అమెరికా శాంతి ప్రయత్నాలు విఫలమైన దరిమిలా.. రష్యాపై కనీసం 40 రోజుల పాటు సుదీర్ఘ ‘ఇన్‌ఫ్లుయెన్స్ ఆపరేషన్’ కొనసాగించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వ్యూహంలో భాగంగానే ఉక్రెయిన్ సైన్యం సరిహద్దులు దాటి రష్యా భద్రతా వలయాన్ని ఛేదిస్తూ ఈ తరహా ప్రతీకార దాడులకు తెగబడుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముందు ముందు ఈ దాడుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.