రాహుల్ విదేశీ పర్యటనలపై కమలదళం గురి.
* నెట్టింట ‘లాపతా రాహుల్’ ప్రచారం.
* సినిమాల పేర్లతో వ్యంగ్యాస్త్రాలు.
* ఖర్చులపై పారదర్శకత లేదని బీజేపీ ఫైర్.
* ఆయనో ప్రపంచస్థాయి నాయకుడు.
* విమర్శలను దీటుగా తిప్పికొట్టిన కాంగ్రెస్.
ఢిల్లీ, మహా.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింది. రాహుల్ తరచూ దేశం దాటుతుండటాన్ని తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. ‘లాపతా రాహుల్’ (కనిపించకుండా పోయిన రాహుల్) పేరిట సరికొత్త పోస్టర్ల యుద్ధానికి తెరతీసింది. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న ఆయన బాధ్యతలు గాలికొదిలేసి పర్యటనలకే పరిమితమవుతున్నారని ఆరోపిస్తూ నెట్టింట ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
ఈ ప్రచారంలో భాగంగా కాషాయ శ్రేణులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని రాహుల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పోస్టర్లను మార్ఫింగ్ చేస్తూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నాయి. ‘చక్ దే ఇండియా’కు బదులుగా ‘ఛడ్ దే ఇండియా’ (భారత్‌ను వదిలేయ్) అని, ‘రాహుల్ ఇన్ పారిస్’, ‘పరదేశ్’ అంటూ వివిధ రకాల పేర్లతో మీమ్స్ సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు అన్న హోదాను కాస్తా ‘పర్యటనల నేత’గా మార్చుకోవాలంటూ బీజేపీ అధికార ప్రతినిధులు ఎద్దేవా చేస్తున్నారు. ఢిల్లీ బీజేపీ శాఖ ‘స్వదేశ్ వర్సెస్ పరదేశ్’ పేరుతో ఒక పోస్టర్‌ను విడుదల చేయగా.. గోవా బీజేపీ సైతం రాహుల్ గాంధీ థాయ్‌లాండ్‌లో విహారయాత్ర చేస్తున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించింది.
రాహుల్ పర్యటనల వెనుక ఉన్న ఆర్థిక మూలాలపై కమలనాథులు తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేతలు షెహజాద్ పూనావాలా, ఆర్పీ సింగ్ తదితరులు ఈ యాత్రల పారదర్శకతను ప్రశ్నించారు. ఇప్పటివరకు రాహుల్ గాంధీ దాదాపు 55 సార్లు విదేశీ పర్యటనలు చేశారని, ఇందుకు సుమారు రూ.60 కోట్లకు పైగా వెచ్చించి ఉంటారని వారు అంచనా వేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన వెల్లడించిన ఆదాయానికి, విదేశాల్లో ఆయన చేస్తున్న ఖర్చులకు ఏమాత్రం పొంతన లేదని ఆరోపించారు. ఈ పర్యటనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, వాటి స్పాన్సర్లు ఎవరో దేశ ప్రజలకు బహిర్గతం చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ చేస్తున్న ఈ విమర్శల దాడిని కాంగ్రెస్ పార్టీ అంతే దీటుగా తిప్పికొట్టింది. రాహుల్ గాంధీ కేవలం ఒక దేశానికే పరిమితమైన నాయకుడు కాదని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గొప్ప నేత అని కౌంటర్ ఇచ్చింది. ఆయనపై వస్తున్నవి కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేసింది. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి అభిమానం ఉందని, ఆయన్ను ఒక విశేషమైన నాయకుడిగా వారు భావిస్తారని తెలిపారు. ఆ కారణం చేతనే వివిధ దేశాలు, అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయనకు తరచూ గౌరవప్రదమైన ఆహ్వానాలు అందుతుంటాయని, అందులో భాగంగానే ఆయన విదేశాలకు వెళ్తుంటారని స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇలాంటి అనవసర రాద్ధాంతాలకు తెరలేపుతోందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.








