ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం సహించం.
* ‘ఫ్రైడే-డ్రైడే’ అమలుపై పవన్ కల్యాణ్ కఠిన ఆదేశాలు.
* కాగితాలకే పరిమితమైతే సహించేది లేదని అధికారులకు తీవ్ర హెచ్చరిక.
* అమరావతి వేదికగా పారిశుద్ధ్యం, దోమల నివారణపై ఉన్నత స్థాయి సమీక్ష.
అమరావతి, మహా.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అధికారులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని ఆయన తేల్చిచెప్పారు. అమరావతిలో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ తదితర అత్యవసర అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ మార్పులు, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దోమల నివారణ, అంటువ్యాధుల నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ కేవలం కాగితాలకే పరిమితం కాకూడదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలో ఇది అత్యంత కఠినంగా, పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. పారిశుద్ధ్య విధుల్లో జవాబుదారీతనం కోసం, ప్రతి శుక్రవారం అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించి తీరాలన్న నిబంధనను తప్పనిసరి చేశారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా మురుగు నిల్వలు లేకుండా తక్షణమే తొలగించాలని, దోమల ఉత్పత్తికి కారణమయ్యే కేంద్రాలను శాశ్వతంగా నిర్మూలించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజారోగ్యానికి ఎలాంటి ముప్పు కలగకుండా ముందస్తుగా బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలను తగిన మోతాదులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, వీటి లభ్యతలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడంతో పాటు క్రమం తప్పకుండా వీధుల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం స్థానిక సంస్థల కనీస బాధ్యత అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది కచ్చితమైన సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను సైతం ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వాములను చేసినప్పుడే అంటువ్యాధుల రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలమని ఆయన దిశానిర్దేశం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులను హెచ్చరించారు.








