Mahaa Daily Exclusive

  వెలిగొండ ఆలస్యానికి వారి నిర్లక్ష్యమే కారణం.

Share

  •  2027 నాటికి పనులన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు.
  •  రూ. 300 కోట్లతో మొదటి విడత నిర్వాసితుల అకౌంట్లలోకి నగదు జమ.
  • మార్కాపురాన్ని లక్ష కోట్ల పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం.
  •  పోలవరం, అమరావతిని దెబ్బతీసి రాష్ట్రంపై గత పాలకుల భారీ భారం.
  •  2027 కల్లా పోలవరం పూర్తి.. ఐదు నదుల అనుసంధానమే మా లక్ష్యం.

    దోర్నాల (మార్కాపురం):మహా.
    నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలను తీర్చి, ఆ ప్రాంతాల తలరాతలను మార్చే అత్యంత కీలకమైన ప్రాజెక్టు వెలిగొండ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లిలో శనివారం నిర్వహించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతుల ముఖాముఖి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ వెనుకబడిన ప్రాంతానికి వస్తాయని గతంలో ఎవరూ ఊహించలేదని, రాయలసీమతో పాటు మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకురావాలనే గొప్ప ఆలోచన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారే చేశారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును తాము 1996 మార్చి 26న ప్రారంభించామని, నాటి నుంచి నేటి వరకు నిర్వాసితుల కోసం రూ. 900 కోట్లు పునరావాసం కింద కేటాయించగా, అందులో మొదటి విడతగా రూ. 300 కోట్లను నేరుగా 3,351 మంది నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు. నిర్వాసితుల త్యాగం ఎప్పటికీ వృథా కాదని, అందరికంటే మెరుగైన ఆదర్శవంతమైన జీవితాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.
    రూ. 3,900 కోట్లతో మిగిలిన పనులు.. ఆదర్శ టౌన్‌షిప్‌గా కాలనీలు
    ఈ ప్రస్తుత ఐదేళ్ల టర్మ్‌లో వెలిగొండ ప్రాజెక్టుపై రూ. 3,900 కోట్ల వ్యయం కానుందని, 2027 నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫేజ్-1, ఫేజ్-2 పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయని, ఇడుపూరు, గోగులదిన్నే, తోకపల్లి వంటి పునరావాస కాలనీల్లో అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. మార్కాపురానికి తాము ప్రత్యేక జిల్లా హోదా ఇచ్చామని, కొత్త కలెక్టరేట్ కార్యాలయం కూడా పునరావాస కాలనీ పక్కనే ఏర్పాటు కాబోతోందని, భవిష్యత్తులో ఈ కాలనీలు ఒక ఆదర్శవంతమైన టౌన్‌షిప్‌లుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, నక్సలిజంపై పోరాటం చేసిన క్రమంలో క్లైమోర్ బాంబుల దాడి నుంచి వేంకటేశ్వరస్వామి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డానని భావోద్వేగానికి లోనయ్యారు.
    డిజిటల్ అరెస్ట్ మోసాల తరహాలోనే.. వైసీపీ డిజిటల్ మోసాలు
    ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని, దాదాపు 43.5 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకోసం సుంకేసుల, గొట్టిపడియ డ్యామ్‌లకు రూ. 120 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చి, ఇప్పటికే రూ. 98 కోట్లతో సుంకేసుల పనులను మొదలుపెట్టామన్నారు. పదేళ్ల ముందే ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే రైతుల కష్టాలు ఎప్పుడో తీరిపోయేవని, కానీ గత ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఇది ఆలస్యమైందని దుయ్యబట్టారు. గత పాలకులు రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లారని విమర్శించారు. టన్నెల్-2లో భారీ యంత్రం చిక్కుకుపోయినా, దానిని తొలగించకుండానే కేవలం ఓట్ల కోసం గత ముఖ్యమంత్రి హడావుడిగా ప్రారంభోత్సవాల డ్రామాలు ఆడారని మండిపడ్డారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల తరహాలోనే.. గత వైసీపీ ప్రభుత్వ మోసాలు, డ్రామాలు కూడా డిజిటల్ మోసాలుగా సాగాయని ఎద్దేవా చేశారు.
    మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం
    ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని, పెండింగ్ బిల్లులన్నింటినీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతంలో కరువు పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఐఏఎస్ అధికారినే ఇక్కడ కలెక్టర్‌గా నియమించామన్నారు. మార్కాపురం ప్రాంతాన్ని అద్భుతమైన హార్టికల్చర్ (తోటపని) హబ్‌గా మారుస్తామని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రూ. 1 లక్ష కోట్లతో భారీ ప్రణాళికను సిద్ధం చేశామని వెల్లడించారు. ఇందులో రూ. 40 వేల కోట్లు ప్రభుత్వం భరిస్తే, రూ. 60 వేల కోట్లు ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా సమీకరిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను భారీగా తీసుకువచ్చి స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని, ఎఫ్‌పీఓల (రైతు ఉత్పత్తిదారుల సంస్థలు) ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రామాయపట్నం పోర్టు, కొత్తగా రాబోయే ఎయిర్‌పోర్ట్, మెరుగైన రోడ్డు, రైల్వే కనెక్టివిటీ ద్వారా ఈ ప్రాంత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
    అమరావతిని ఆపడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం
    రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని, మైక్రో ఇరిగేషన్‌ను మళ్లీ గాడిలో పెడుతున్నామని సీఎం చెప్పారు. గతంలో తాము సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు చేసి, హంద్రీ-నీవాను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరిచ్చామన్నారు. అయితే, గత ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా ఆలస్యమై రాష్ట్రంపై ఊహించని ఆర్థిక భారాన్ని మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేయడం వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుపడిందన్నారు. నాడు తమపై నమ్మకంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను తాము ఎంతో విజన్‌తో అభివృద్ధి చేయడం వల్లే నేడు తెలంగాణ ఆ స్థాయిలో రాణిస్తోందని, అదే విధంగా ఏపీ అభివృద్ధికి అమరావతి రాజధాని అత్యంత కీలకమని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామని, ప్రజలు కులమతాలకు అతీతంగా కేవలం అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
    దేశంలో ఐదు నదుల అనుసంధానమే అంతిమ లక్ష్యం
    తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మార్కాపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల తుంగభద్ర డ్యాం గేట్లు విరిగిపోయినప్పుడు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టామని, కేవలం అతి తక్కువ కాలంలోనే 33 కొత్త గేట్లను తయారు చేయించి ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో జాతికి అంకితం చేశామని గుర్తుచేశారు. దేశంలో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ ద్వారా కరెంట్ కొరత తీరినట్లు, సెల్‌ఫోన్ విప్లవంతో ప్రభుత్వ సేవలు ప్రజల చేతుల్లోకి వచ్చినట్లు.. దేశంలో నదుల అనుసంధానం కూడా జరిగి తీరాలన్నారు. గంగా-కావేరి నదుల అనుసంధానం దేశానికి ఎంతో అవసరమని ఆకాంక్షించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి, అక్కడి నుంచి నల్లమల సాగర్‌కు గోదావరి జలాలను తీసుకువస్తామన్నారు. భవిష్యత్తులో అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ సిస్టమ్ ద్వారా కావేరి నదికి కూడా నీటిని తరలించవచ్చని, దీనివల్ల దేశంలో ఐదు ముఖ్యమైన నదులు అనుసంధానమై నాలుగు దక్షిణాది రాష్ట్రాలు ఎంతో సుభిక్షంగా మారుతాయని తన అద్భుతమైన విజన్‌ను పంచుకున్నారు.
    నన్ను చూడండి.. కూటమిని చూడండి..
    “మార్కాపురం జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నాది. మీ కంటికి కనిపించే స్థానిక నాయకులను కాకుండా.. నన్ను చూడండి, నా విజన్‌ను చూడండి, తెలుగుదేశం పార్టీని మరియు ఎన్డీయే కూటమిని నమ్మండి. ప్రజల ఆమోదం లేని ఏ నిర్ణయాన్నీ నేను తీసుకోను. నాడు పోలవరం ప్రాజెక్టు కోసం అక్కడి రైతులు ఎంతో త్యాగం చేశారు కాబట్టే, వారి గౌరవార్థం ఒకే నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాను. అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు రైతులు త్యాగనిరతిలో యావత్ రాష్ట్రానికే ఆదర్శం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆత్మీయంగా ముగించారు.