Mahaa Daily Exclusive

  మధ్యాహ్న భోజన కార్మికుల జీవితాలతో చెలగాటం.

Share

  •  ‘స్మార్ట్ కిచెన్స్’ పేరిట కుట్ర…వైఎస్ జగన్ ఫైర్.
  •  రెండు నెలలుగా బకాయి పెట్టిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.
  •  పేద మహిళలను రోడ్డున పడేసి సొంత పార్టీ వారి పొట్ట నింపే ప్రయత్నం.
  •  అక్కచెల్లెమ్మలకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని భరోసా.అమరావతి, మహా.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల మంది మహిళా కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ‘స్మార్ట్ కిచెన్స్’ పేరుతో దశాబ్దాలుగా పనిచేస్తున్న పేద అక్కచెల్లెమ్మలను రోడ్డున పడేసే అతిపెద్ద కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
    స్మార్ట్ కిచెన్స్ ముసుగులో సొంత నేతలకు మేలు
    గత 20 ఏళ్లకు పైబడి మధ్యాహ్న భోజన పథకంలో ఎంతో మంది మహిళలు వంట కార్మికులుగా తమ నిస్వార్థ సేవలు అందిస్తున్నారని జగన్ గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు అకస్మాత్తుగా ‘స్మార్ట్ కిచెన్స్’ అనే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి, ఆ ముసుగులో తమ తెలుగుదేశం పార్టీ వారికి, అనుకూలురకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వారి పొట్టలు నింపుతోందని విమర్శించారు. ఏళ్ల తరబడి ఈ పథకాన్ని నమ్ముకుని బతుకుతున్న పేద మహిళల కడుపు కొట్టి, వారిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించే కిరాతక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
    రెండు నెలలుగా ఆగిన జీతాలు.. గతంలో మేమే పెంచాం..
    మధ్యాహ్న భోజన కార్మికులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గత రెండు నెలలుగా వారికి ఇవ్వాల్సిన జీతాలను బకాయి పెట్టిందని జగన్ ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ కార్మికులకు కేవలం రూ. 1,000 మాత్రమే వేతనం ఉండేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి కష్టాన్ని గుర్తించి ఆ వేతనాన్ని అమాంతం రూ. 3,000 లకు పెంచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు, తాము అధికారంలోకి వస్తే కార్మికులకు మరింత మేలు చేస్తామని, ఎన్నో వరాలు ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. తీరా గద్దెనెక్కాక వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని దుయ్యబట్టారు.

తక్షణమే బకాయిలు విడుదల చేసి, వేతనాలు పెంచాలి!
కూటమి ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులకు వైఎస్సార్సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. వారి హక్కుల సాధన కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని               స్పష్టం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో పెట్టిన జీతాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వంట               కార్మికుల జీతాలను తక్షణమే పెంచాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు.