Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ దోపిడీతో తెలంగాణ విధ్వంసం….

Share

బీఆర్ఎస్ దోపిడీతో తెలంగాణ విధ్వంసం.
* పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు.
* సంక్షేమం, అభివృద్ధే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
హైదరాబాద్, మహా.
గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల పాటు తమ కుటుంబం, తమ నలుగురి కోసమే అన్నట్లుగా రాష్ట్రాన్ని పాలించి ఆర్థికంగా, సామాజికంగా దోచుకుని విధ్వంసం చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను వాళ్ల చేతుల్లో పెడితే వనరులన్నీ కొల్లగొట్టి, ఏకంగా రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. సోమవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జరిగిన ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక ఉత్సవాల్లో సతీసమేతంగా ఆయన పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం దంపతులకు వేదపండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకున్న రాష్ట్ర సంపదతోనే బీఆర్ఎస్ నేతలు పత్రికలు, ఛానళ్లు పెట్టి, సోషల్ మీడియా ద్వారా నేటి ప్రజా ప్రభుత్వంపై కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు భార్యాభర్తలు మాట్లాడుకున్నా, అధికారులు, వ్యాపారస్థులు, సినీ ప్రముఖులు ఎవరు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్‌లతో వింటూ ఎవరినీ స్వేచ్ఛగా బతకనివ్వని రాక్షసత్వాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాధవ సేవే మానవ సేవ అనే మన సంస్కృతి, విలువలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోందని భట్టి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు తీర్చడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలమన్న రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్న ఉద్దేశంతో రూ.22,500 కోట్లతో ఒకేసారి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియ్యం రూ.50కి పైగా పలుకుతున్నా, రాష్ట్రంలోని ఏ పేద కుటుంబం నాణ్యమైన ఆహారానికి దూరం కాకూడదని 1.06 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే 53 లక్షల పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 90 శాతం గ్రామాల్లో కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందని, వ్యవసాయానికి సంబంధించి 30 లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంటు ఇస్తూ ఏటా రూ.14 వేల కోట్లను డిస్కమ్‌లకు ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించామని, ఇందుకోసం ఇప్పటికే రూ.10,600 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు.
మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.20 వేల కోట్ల రుణాలు అందిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని సైతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి పేదలకు అండగా నిలిచామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచామని చెప్పారు. అత్యంత మానవీయ కోణంలో 27 లక్షల మంది విద్యార్థులకు (ప్రభుత్వ బడుల్లో 20 లక్షలు, రెసిడెన్షియల్స్‌లో 7 లక్షలు) ఉచిత అల్పాహారంతో పాటు వారంలో ఒకరోజు పాలు, మరో రోజు రాగిజావ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం రూ.2,216 కోట్లు కేటాయించామని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ లాంటి గిరిజన ఆరాధ్య దైవాల క్షేత్రాలను ప్రజల మనోభావాలు కాపాడేలా వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుంటే.. కాంగ్రెస్ రాగానే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి 76 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని, జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని స్పష్టం చేశారు.
సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.90 వేల కోట్లతో రహదారుల పనులకు మంజూరు ఇచ్చామని, నల్గొండలో రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశామని గుర్తుచేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ప్రపంచంతో పోటీపడేలా ఒక అద్భుతమైన ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల అనుసంధానంతో పాటు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు.. కోర్ అర్బన్ రీజియన్‌లో సేవా రంగం, పెరి అర్బన్ రీజియన్‌లో పరిశ్రమలు, రూరల్ రీజియన్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీసీసీ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తదితర సీనియర్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.