రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం.
• ఖర్గే, తరుణ్ చుగ్ సహా ఎనిమిది మంది సభ్యుల ప్రవేశం.
* రాజ్యసభలో కొత్త సభ్యులకు స్వాగతం.
* చైర్మన్ రాధాకృష్ణన్ సమక్షంలో ప్రమాణం.
ఢిల్లీ, మహా.
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రవేశంతో పార్లమెంట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత తరుణ్ చుగ్‌తో పాటు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మరో ఆరుగురు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రముఖులు పాల్గొని కొత్త సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ ఛాంబర్‌లో ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేతిలో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని హిందీ భాషలో ప్రమాణం చేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం చైర్మన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సభలో విజయవంతమైన పదవీకాలాన్ని ఆకాంక్షించారు.
ఖర్గేతో పాటు భారతీయ జనతా పార్టీ నేత తరుణ్ చుగ్, గుజరాత్‌కు చెందిన జితేంద్ర మేఘ్‌జీభాయ్ కంజారియా, మాన్‌సింగ్్ మెరమాన్ పర్మార్, కర్ణాటకకు చెందిన ఎం. నాగరాజా, మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర హీరాలాల్ జైన్, మణిపూర్‌కు చెందిన అధికారమయుమ్ శారదా దేవి, రాజస్థాన్‌కు చెందిన అల్కా సింగ్ రాజ్యసభ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సమక్షంలో సభ్యులందరూ రాజ్యాంగబద్ధంగా తమ బాధ్యతలను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్, సభ నాయకుడు జె.పి. నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. వీరు చైర్మన్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంతో పాటు రాజ్యసభ సభాగృహంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార వేడుకలో కూడా పాల్గొన్నారు.
మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఖర్గేకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ కొత్తగా ఎన్నికైన సభ్యులను సభలోకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో చర్చలు జరపాలని, చట్టాల రూపకల్పనలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్త సభ్యుల రాకతో రాజ్యసభ కార్యకలాపాలకు మరింత బలం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








