Mahaa Daily Exclusive

  తెలంగాణలో బెంగాల్ వ్యూహం…

Share

  • తెలంగాణలో బెంగాల్ వ్యూహం
  • రంగంలోకి సంఘ్ పరివార్
  • క్షేత్ర స్థాయికి కమల వ్యూహం
  • 2028 లక్ష్యాంగా బీజేపీ ప్రణాళికలు
  • దక్షిణాదికి తెలంగాణను హబ్ గా మార్చడమే లక్ష్యం
  • ఎన్నిక ఏదైనా గెలుపే ముఖ్యం
  • నితిన్ నబిన్ బోధనతో కదణరంగంలోకి బీజేపీ

హైదరాబాద్, మహా : ఇప్పటిదాకా ఒక లెక్కా ఇకనుంచి మరో లెక్క బీజేపీ తాజా వ్యూహం ఇది. 2028 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీ భవిష్యత్ లక్ష్యాన్ని భారీగా ముందు పెట్టుకుని నడవాలని లక్ష్యాంగా పెట్టుకొనుంది. గతానికి భిన్నంగా కొత్త వ్యూహంతో ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర స్థాయి కాషాయ దళం నేతలంతా కలిసికట్టుగా ఇక క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పనిచేయనున్నారు. ఇప్పటి నుంచే టార్గెట్ 2028 ను పూర్తి చేసేందుకు పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణ మొత్తం ఆర్ఎస్ఎస్ శ్రేణులను రంగంలోకి దింపేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ తో పాటు అనుబంధ సంస్థల బలగాలు కూడా అత్యంత కీలకంగా పని చేయనున్నాయి. బెంగాల్లో ఫలించిన రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టి తెలంగాణాలో అమలు చేయాలన్న అంశంపై రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పార్టీ పదాధికారుల సమావేశంలో మార్గనిర్దేశం చేశారు. ఆయన ఆలోచనల ప్రకారం.. ఉత్తరాధి రాష్ట్రాల నుంచి సంఘ్ పరివార్ తో పాటు అన్ని విభాగాల బృందాలను రాష్ట్రానికి రప్పించి కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

దేశ భద్రత, జాతీయతను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), యువతను మేల్కొలిపేందుకు పనిచేస్తున్న ‘భజరంగ్ దళ్’, ప్రపంచ వ్యాప్తంగా హింధూ ధర్మ పరిరక్షణ, ప్రచార బాధ్యతలను భుజానెత్తుకుని పనిచేస్తున్న ‘విశ్వహిందూ పరిషత్’, విదేశీ వస్తువులను బహిష్కరించి దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరిచేందుకు పనిచేస్తున్న ‘స్వదేశీ జాగరణ్ మంచ్’, ప్రారిశ్రామిక రంగాభివృద్ధికి పనిచేస్తున్న ‘లఘు ఉద్యోగ్ భారతి’, గిరిజనుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్న ‘వనవాసి కళ్యాన్ ఆశ్రమం’, ఆర్ఎస్ఎస్ తరహాలోనే మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న ‘రాష్ట్రీయ సేవికా సమితి’, పాఠశాల విద్యా వ్యవస్థను జాగృతం చేస్తున్న ‘విద్యా భారతి’ సంస్థలకు చెందిన ప్రత్యేక బృందాలు ప్రతి నెలలో రెండు పర్యాయాలు తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నాయి. స్థానిక పరిస్థితులను, పరిణామాలను, పార్టీ బలాబలాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ అధిష్టానానికి అందజేయనున్నారు. అలాగే నాయకుల మధ్య సమన్వయ లోపం, అందుకు గల కారణాలు, సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలను అధిష్టానం సూచించనుంది. అదే సమయంలో బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న విద్యార్థి విభాగం బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రస్తుత రాజకీయాల్లో విద్యార్థుల అవసరం, ప్రమేయాన్ని గుర్తు చేయనున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. 2028 సార్వత్రిక ఎన్నికల్లో భావి భాగస్వామ్యం అత్యంత క్రియాశీలకం కానుంది.

కార్మిక రంగాన్ని మేల్కొలిపి వారి హక్కులను పరిరక్షించే దిశగా ‘బీజేపీకి మరో అనుబంధ సంస్థ ‘భారతీయ మజూర్ సంఘ్ పరివార్ పనిచేయనుంది. వ్యవసాయ రంగాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న చేయూత, దేశ నిర్మాణంలో రైతలు భాగస్వామ్యంపై అవగాహన కల్పించి వారిని రాజకీయాల్లో క్రియాశీలకం చేసేందుకు ‘భారతీయ కిసాన్ సంఘ్’ రాజకీయ చదరంగంలోకి దిగనుంది. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆలోచనల మేరకు అంతర్గతంగా పక్కా ప్రణాళికతో బీజేపీ రాజకీయ వ్యూహాన్ని రచిస్తోందని, దాని అమలు తర్వాత తమ పార్టీని తట్టుకోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సాధ్యం కాదన్న ధీమా ముఖ్య నేతల నుంచి వ్యక్తమవుతోంది. ఆ ప్రణాళిక ప్రకారం.. ముందుగా రాష్ట్రమంతటా గ్రామ స్థాయి వరకూ కమిటీలను బలోపేతం చేయనున్నారు. బెంగాల్ లో బలంగా పాగా వేసిన టీఎంసీని దీకొన్న మాదిరిగా తెలంగాణాలో తయారువాల్లన్నది బీజేపీ వ్యూహం. వచ్చే పరిషత్, గ్రేటర్ ఎన్నికల్లో బల నిరూపణకు కసరత్తు చేసి బలాన్ని నిరూపించుకోనున్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల వ్యూహాలకు, ఆలోచనలకు భిన్నంగా ఈ రెండు ఎన్నికల్లో ధీటైన పోటీ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రతిపాదిత పథకాలే ప్రచారాస్త్రంగా, ప్రధాన అజెండా పార్టీ యంత్రాంగమంతా పనిచేయనుంది. ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. సంస్థాగత సమస్యలు, సవాళ్లు సమసిపోవాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభీష్టం మేరకు నిర్ణయాలు జరగాలని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్ర పదాధికారులకు గత రెండు రోజులుగా దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఆ ప్రకారం వారం, పది రోజుల్లోగా తెలంగాణ బీజేపీ రాజకీయ కార్యాచరణ సిద్ధం కామన్నదని తెలుస్తోంది.

మూల సిద్దాంతం ఆదారంగా

జాతి ఐక్యత, హిందూత్వ వాదం ప్రత్యేక నినాదాలుగా జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు వేగవంతం చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణాలోనూ బల నిరూపణకు సంసిద్ధమవుతోంది. త్వరలోనే మొదలు కాబోతున్న పరిషత్, గ్రేటర్ ట్రై కార్పొరేషన్ల ఎన్నికలలు, వరంగల్ కార్పొరేషన్ సమరంలో బలమైన లక్ష్యంతో కదం తొక్కాలని అధినాయకత్వం నిర్ణయించింది. అందుకోసం ‘కమలం’ పార్టీ కొత్త వ్యూహాన్ని ఖరారు చేసుకుని గ్రామ గ్రామాన ఉనికిని చాటుకునే దిశగా ముందడుగు వేయబోతోంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాంచందర్రావు నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల సమన్వయంతో త్వరలోనే సమావేశమై క్షేత్రస్థాయి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. జాతీయ పార్టీగా దేశమంతా అనుసరిస్తున్న వ్యూహానికి భిన్నంగా తెలంగాణాలో ‘సంక్షేమంలో సగం.. అభివృద్ధిలో భాగం’ అన్న నినాదంతో సామాజిక అభివృద్ధిలో, పేదరిక నిర్మూలనలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించే దిశగా వ్యూహంతో కమలనాధులు కదం తొక్కబోతున్నారు.

సామాన్యులే లక్ష్యంగా

గ్రామ పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలకు సమయంలోనూ తాను సైతం అంటూ బల నిరూపణకు ప్రయత్నించిన బీజేపీ పరిషత్, గ్రేటర్ ఎన్నికల్లో లక్ష్య సాధనకు నడుం బిగిస్తోంది. సమయం సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా, ధీటుగా వారం, పది రోజుల్లోగా క్షేత్రస్థాయిలో కాషాయ దళం కదం తొక్కనుంది. మెజారిటీ కుటుంబాలకు వర్తిస్తున్న ప్రతి సంక్షేమ పథకానికీ కేంద్ర సర్కారు ఆర్థిక చేయూత అందిస్తున్న తీరును పేద, మధ్యతరగతి వర్గాలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తే.. ఇప్పుడున్న ఓటు బ్యాంకును దాదాపు రెండింతలు పెంచుకోవచ్చున్న కోణంలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను సంసిద్ధం చేసింది. అదే నినాదంతో నినాదంతో భాజపా శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కనీసం పది శాతం పంచాయతీలైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ఉంది. దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వివిధ కార్మిక, యువజన, విద్యార్థి సంఘాలు, ధార్మిక సంస్థల పాత్ర క్రియాశీలకం చేయబోతున్నారు.

ఇంటింటి ప్రచారం

గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ ఎంతో కొంత ప్రయోజనం చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపైనే ప్రధానంగా బీజేపీ నేతలు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ప్రతి కిలో ఒక్కింటికి కేంద్ర ప్రభుత్వం రూ.29 చొప్పున చెల్లిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదల సొంతింటి నిర్మాణానికి ఒక్కో యూనిట్కు రూ.3.50 లక్షల చొప్పున ఇస్తున్న విషయాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులు, గ్రామ పంచాయతీలకు, మునిసిపాలిటీలకు రోజ్ గార్ పథకం కింద ఇస్తున్న గ్రాంట్ నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తున్న నిధులు, గ్రామీణ సడక్ యోజన పథకం కింద రహదారుల అభివృద్ధి, గడిచిన ఐదేళ్లలో దాదాపు 4వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ, పాలమూరు వరక్సిటీకి రూ.100 కోట్లు, తెలంగాణ వర్సిటీకి రూ.50 కోట్లు, ఇతర యూనివర్సిటీలకు ఇస్తున్న యూజీసీ గ్రాంటు నిధులు, యువజనోపాధికి ఇస్తున్న చేయూత ఇతర పథకాల ద్వారా రాష్ట్రం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పొందుతున్న ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించి విస్తృత ప్రచారం నిర్వహించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంసిద్ధమవుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు, తదితర అంశాలపై తాజాగా చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం, ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బీజేపీ క్రియాశీలకమయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న క్రమంలో ఈ ఎన్నికల్లో సత్తా చాటి రానున్న రోజుల్లో మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బలమైన పట్టు సాధించేందుకు అన్ని కోణాల్లో తిప్పలు పడుతోంది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోగా రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ బలోపేతం కావాలంటే ప్రధానంగా క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలను తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపాలిటీల్లో కేడర్ను సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.