Mahaa Daily Exclusive

  ఎన్నికల వ్యవస్థలో భారత్ ముందంజలోనే ఉంది….

Share

ఎన్నికల వ్యవస్థలో భారత్ ముందంజలోనే ఉంది.
* పారదర్శక ఎన్నికల్లో భారతదేశం ప్రపంచానికే ఆదర్శం.
* ప్రజాస్వామ్యానికి బూత్ స్థాయి అధికారులే మూల స్తంభాలు.
* ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్.
ఢిల్లీ, మహా.
ప్రపంచంలో ఎన్నికలు నిర్వహించే దేశాల్లో భారతదేశం అత్యంత విశ్వసనీయమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. పారదర్శకత, నిష్పక్షపాత విధానం, సాంకేతికత వినియోగం, క్షేత్రస్థాయి సిబ్బంది సమర్థత కారణంగానే భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో బూత్ స్థాయి అధికారులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత ఎన్నికల నిర్వహణ విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఓటర్ల నమోదు నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటింపు వరకు ప్రతి దశ కూడా పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ప్రతినిధులు ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించే అవకాశం ఉండటం భారత ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను మరింత పెంచిందని వివరించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతంగా కొనసాగడంలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని సీఈసీ అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఓటర్లకు అవసరమైన సమాచారం అందించడం వంటి బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల విజయానికి వారి అంకితభావమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థల అభివృద్ధికి కృషి చేసే అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్కు 2026 సంవత్సరానికి భారత్ అధ్యక్షత వహించడం దేశ ఎన్నికల వ్యవస్థకు దక్కిన అంతర్జాతీయ గౌరవానికి నిదర్శనమని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భారత అనుభవాన్ని అనేక దేశాలు అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ మూడు రోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుద్గాంలోని ఫ్యాషన్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో బూత్ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది, ఓటర్లతో నేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు.

ఓటర్లతో ఎన్నికల సంఘం అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, ఓటరు జాబితాల నాణ్యతను పెంచడం, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

అత్యంత విస్తారమైన భౌగోళిక పరిస్థితులు, కోట్లాది ఓటర్లు, లక్షలాది పోలింగ్ కేంద్రాల మధ్య కూడా ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించగల సామర్థ్యం భారత ఎన్నికల సంఘం ప్రత్యేకతగా నిలిచిందని సీఈసీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికల నిర్వహణలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు.