Mahaa Daily Exclusive

  కుడా భూముల వేలం పూర్తిగా పారదర్శకం: చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి

Share

*పారదర్శకంగానే కుడా భూముల వేలం

*ప్ర‌భుత్వానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం

*రాజకీయ ఉనికి కోసమే తప్పుడు ప్రచారాలు

*మర్రి యాదవరెడ్డి పై కుడా చైర్మ‌న్ ఇనగాల ఫైర్

*నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చర్య‌లు

*కుడా ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించం

మహా వరంగల్ బ్యూరో:

కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ భూముల వేలం పై మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను కుడా చైర్మన్ డిసిసి అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. శుక్రవారం హన్మకొండ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలసముద్రం భూముల వేలం ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా జరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

*సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం

మాజీ చైర్మన్ చేసిన ఆరోపణలకు అధికారిక రికార్డులు, వేలం పత్రాలతో సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇనగాల తెలిపారు. ఈ క్రమంలోనే ఆధారాలతో భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించు కున్నానని, అయితే రామకృష్ణ కాలనీ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడం బాధాకరమన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసుల సూచన మేరకు వెనుదిరిగానని, నిజాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. రాజకీయ ఉనికి కోసం భద్రకాళి ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణాలు చేయడం సరికాదని ఇనగాల తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆధారాలను మీడియాకు లేదా దర్యాప్తు సంస్థలకు సమర్పించాలని ఆయన సవాల్ చేశారు. దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడమేనని, దేవుడి పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని హితవు పలికారు.

*కుడా ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం

కుడా ప్రతిష్టను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చైర్మన్ హెచ్చరించారు. వేలానికి సంబంధించిన అన్ని పత్రాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని, ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు ధృవీకరించని ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, వాస్తవాలను ప్రజలకు చేర వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాజకీయ ఆరోపణలతో అభివృద్ధిని అడ్డుకోలేరని, సత్యమే చివరకు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Latest