Mahaa Daily Exclusive

  ఉల్లి రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. కనీస మద్దతు ధర 13 శాతం పెంపు..!

Share

ఢిల్లీ, మహా.

దేశంలోని ఉల్లి సాగు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉల్లిపాయల కనీస మద్దతు ధరను ఏకంగా 13 శాతం మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా ధరల పెంపుతో మార్కెట్లో ఇప్పటివరకు క్వింటాలుకు రూ.1,875 గా ఉన్న ఉల్లి ధర, ఇకపై రూ.2,125కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉల్లి సేకరణను భారీగా పెంచడంతో పాటు, రైతులకు మరింత ఆర్థిక లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పెంచిన ఈ నూతన మద్దతు ధర తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

**మందకొడిగా బఫర్ స్టాక్ సేకరణ.. పలుమార్లు పెరిగిన ధర**

ప్రస్తుత సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం ఉల్లి మద్దతు ధరను పెంచడం ఇది మొదటిసారేం కాదు. దేశంలో ఉల్లి బఫర్ స్టాక్ సేకరణ ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగుతుండటమే ఈ వరుస ధరల పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, జూన్ 1వ తేదీ నాటికి ప్రభుత్వం కేవలం 2 వేల టన్నుల ఉల్లిని మాత్రమే సేకరించగలిగింది. బఫర్ స్టాక్ లక్ష్యాన్ని చేరుకోవడానికి రైతులను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం మే నెల నుంచి వరుసగా ధరలను సవరిస్తూ వస్తోంది.

గతంలో మే 22వ తేదీన కిలో ఉల్లి ధరను రూ.12.70 పైసల నుంచి రూ.15.80 పైసలకు పెంచుతూ తొలిసారి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత జూన్ 13వ తేదీన ఆ ధరను కిలోకు రూ.16.50 పైసలకు పెంచగా, జూన్ 20వ తేదీన మరింత పెంచుతూ కిలో ఉల్లిపాయల ధరను రూ.18.75 పైసలుగా నిర్ణయించింది. తాజాగా ఇప్పుడు క్వింటాలుకు రూ.2,125 (అనగా కిలోకు రూ.21.25 పైసలు) కు పెంచుతూ రైతన్నలకు భారీ ఊరటనిచ్చింది.

**307 లక్షల టన్నుల మార్కు దాటనున్న ఉల్లి ఉత్పత్తి**

దేశంలో ఉల్లిపాయల ఉత్పత్తి మరియు లభ్యతపై కేంద్ర వ్యవసాయ శాఖ కీలక అంచనాలను వెల్లడించింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉల్లిపాయల మొత్తం ఉత్పత్తి సుమారు 307.33 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా వేసింది. కాగా, దీనికి ముందు ఏడాదైన 2024-25 మధ్య కాలంలో దేశంలో 307.67 లక్షల టన్నుల ఉల్లిపాయల సేకరణ జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బహిరంగ మార్కెట్లో రైతులకు ఉల్లి పంటకు మంచి డిమాండ్ లభించడమే కాకుండా, ప్రభుత్వ బఫర్ స్టాక్ సేకరణ కూడా ఊపందుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest