- మరో రెండు వేల ఉద్యోగాలకు అనుమతి కోరిన పోలీసు శాఖ
- ససేమిరా అన్న ఆర్థిక శాఖ
- మంజూరైన అయిదు వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ
విధి విధానాలను ఖరారు చేస్తున్న పోలీసు నియామక బోర్డు
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో పోలీసు కొలువుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలనా నియంత్రణలో ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గత నెల 27 జీవో నెంబర్ 78 జారీ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడానికి, పోలీస్ శాఖలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. శాఖలోని కార్యకరాలాపాలు, అవసరాలు, ఆర్థిక సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని, నేరుగా నియామక ప్రక్రియ ద్వారా ఈ ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఐదు వేల పోస్టుల్లో సివిల్ పోలీస్ విభాగం నుంచి టెక్నికల్ విభాగం వరకు వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(సివిల్)- 148 పోస్టులు, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఏఆర్)- 14, రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(టీజీఎస్పీ)- 12, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)-3, అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎఫ్‌పీబీ)-23, పోలీస్ కానిస్టేబుల్(సివిల్) – 3,697, పోలీస్ కానిస్టేబుల్(AR)-1,052,
కానిస్టేబుల్(ఎస్‌ఏఆర్ సీపీఎల్)-24, కానిస్టేబుల్(డ్రైవర్)- పీటీవో 20, కానిస్టేబుల్ (మెకానిక్)- పీటీవో- 7 పోస్టులున్నాయి. ఖరారు చేసిన పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, నియమ నిబంధనలు తదితరాలన్నింటికి సంబంధించి పోలీసు నియామక బోర్డు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.
మరో రెండు వేల పోస్టులపై సందిగ్ధం
ఇదిలా ఉండగా, పోలీసు శాఖలో దాదాపు 19 వేల ఉద్యోగాలు వివిధ స్థాయిలలో ఖాలీగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మంజూరు చేసిన ఐదు వేల పోస్టులకు తోడుగా మరో రెండు వేల పోస్టుల నియామకాల కోసం అనుమతించాలంటూ ఇటీవల పోలీసు శాఖ ఆర్థిక శాఖను కోరుతూ లేఖ రాసింది. అయితే ఈ తాజా ప్రతిపాదనను ఆర్థిక శాఖ పెండింగ్ లో పెట్టింది. రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించేందుకు వివిధ స్థాయిలలో శాఖాపరంగా కొన్ని తాత్కాలిక ఏర్పాట్లను చేయాల్సి ఉన్నందున ఏఖ మొత్తంలో నియామకాలను చేపడితే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో అధికారులు రెండు వేల పోస్టులకు కూడా అనుమతించాలని ఆర్థిక శాఖను కోరుతున్నారు. లేకపోతే ఒక సారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత తిరిగి నోటిఫికేషన్ జారీ చేయడం, రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించడం అనేది ఖర్చతో పాటు శ్రమతో కూడుకున్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆగని నిరుద్యోగుల ఆందోళనలు
మరోవైపు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు దాదాపు 20 వేల వరకు ఉంటాయని, వాటన్నింటినీ భర్తీ చేయాల్సిందేనంటూ గత కొన్నాళ్ళుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తు శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆందోళనలను కూడా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇదే డిమాండ్ తో డీజీపీ కార్యాలయాన్ని ముట్టిడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రితక్త వాతావరణం ఏర్పడింది. పోలీసు శాఖలో ప్రతినెలా దాదాపు 500 మంది రిటైర్ అవుతున్నారని, ప్రస్తుతం మంజూరైన పోస్టుల భర్తీ అయ్యే నాటికి అంటే ంపికైన అభ్యర్థులు శిక్షణ పొంది విధుల్లో చేరే సరికి దాదాపు 18 మాసాలవుతుందని, అప్పటి వరకు మరో తొమ్మిది వేల మంది పోలీసు శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ పొందే అవకాశాలున్నాయి. ఖాళీలను నిరంతరం భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెనుకంజ వేయడం పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








