Mahaa Daily Exclusive

  ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్..! ప్రభుత్వ అనుమతులే లేవా..? హాల్‌టికెట్లు ఎలా వచ్చాయి..?

Share

  •  ప్రభుత్వ అనుమతులే లేవా?.. హాల్‌టికెట్లు ఎలా వచ్చాయి?
  • వారం రోజుల్లో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, మహా.

హైదరాబాద్‌లోని ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ వ్యవహారం తెలంగాణ హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. సల్కం చెరువు పూర్తి నీటిమట్టం పరిధిలో విద్యాసంస్థ భవనాలు నిర్మించారనే ఆరోపణలతో పాటు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే విద్యా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అంశాలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ గుర్తింపు లేని విద్యాసంస్థలో విద్యార్థులకు హాల్‌టికెట్లు, విద్యా ధ్రువపత్రాలు ఎలా జారీ అవుతున్నాయంటూ న్యాయస్థానం సంధించిన ప్రశ్నలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. మరోవైపు, భవన నిర్మాణ అనుమతులపై స్పష్టమైన సమాచారం సమర్పించడంలో జీహెచ్‌ఎంసీ విఫలమవడంపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

గుర్తింపు లేదని ప్రభుత్వ స్పష్టీకరణ

 

ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది, ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేదా గుర్తింపు లేదని కోర్టుకు స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని పరిస్థితిలో విద్యా కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయన్న అంశంపై ధర్మాసనం వివరణ కోరింది.

 

హాల్‌టికెట్లు.. ధ్రువపత్రాలపై ప్రశ్నలు

 

ప్రభుత్వ గుర్తింపు లేని విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులకు హాల్‌టికెట్లు, విద్యా ధ్రువపత్రాలు ఎలా జారీ అవుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, విద్యార్థులు గుర్తింపు పొందిన ఇతర విద్యాసంస్థల్లో అధికారికంగా ప్రవేశాలు పొందారని, ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలో కేవలం బోధన, అకాడమిక్ సౌకర్యాలను మాత్రమే వినియోగిస్తున్నారని వివరించారు. హాల్‌టికెట్లు, ధ్రువపత్రాలు మాత్రం గుర్తింపు పొందిన ఆయా విద్యాసంస్థల నుంచే జారీ అవుతున్నాయని కోర్టుకు తెలిపారు.

 

జీహెచ్‌ఎంసీపై ధర్మాసనం అసంతృప్తి

 

భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు మంజూరయ్యాయా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం సమర్పించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సల్కం చెరువు పూర్తి నీటిమట్టం పరిధిలో నిర్మాణాలు జరిగాయా లేదా, భవన నిర్మాణ అనుమతుల పరిస్థితి ఏమిటి అనే అంశాలపై మూడు నెలల క్రితమే పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

 

వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలి

 

జీహెచ్‌ఎంసీ, పాఠశాల విద్యాశాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలు వారం రోజుల్లో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా వివరాలు సమర్పించని పక్షంలో, ఈ నెల 9న అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

 

పది వేల మంది విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి

 

ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలో ప్రస్తుతం కేజీ నుంచి పీజీ వరకు సుమారు పది వేల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మహిళలకు ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో విద్యను అందిస్తున్న సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అయితే భవన నిర్మాణ అనుమతులు, ప్రభుత్వ గుర్తింపు, చెరువు పూర్తి నీటిమట్టం పరిధిలో నిర్మాణాల అంశాలపై హైకోర్టు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వ్యవహారం న్యాయపరిశీలనలోనే కొనసాగనుంది.

Latest