- రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
- గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం నీళ్లను వదులుతున్నారని ఆరోపణ
- తుమ్మిడిహట్టిలో ప్రభుత్వం తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్న
- తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్, మహా : గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీళ్లను వదులుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుందన్నారు. ఇలాంటి వారిని ఉరితీసినా తప్పులేదన్నారు. నీళ్లు ఉండి కూడా వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగమంతా సొల్లే తప్ప ఏదీ నిజం లేదని, అబద్ధాలకు చొక్కా తొడిగితే రేవంత్ రెడ్డిలా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాంగ్రెస్ ఉన్నప్పుడే తుమ్మిడిహట్టికి ఒప్పందం అయినట్లు సీఎం చెప్పారని, తుమ్మిడిహట్టికి రూ. 6,500 కోట్లు ఖర్చుపెట్టినట్లు సీఎం చెబుతున్నారని, 8 ఏళ్లు కేంద్రం, రాష్ట్రం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. పనులు చేయకుండా రూ.2,328 కోట్లు తిన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మెుబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని తొలగించామని, తుమ్మిడిహట్టికి అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రిని కలిశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ సీఎంలు కోరితేనే ఇవ్వలేదని, మీకు ఎలా ఇస్తామని ప్రశ్నించారని తెలిపారు. తుమ్మిడిహట్టి నిర్మాణానికి అన్ని ప్రయత్నాలు చేశామని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును కావాలని మార్చలేదని, నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్రం లేఖ రాసిందని, నీళ్లు లేని చోట తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కాంగ్రెస్ తలపెట్టిందని అన్నారు. “నీటిపారుదల మంత్రిగా నాకు 3 నెలలు నాకు అవకాశం ఇవ్వండి. నీళ్లు ఎలా రావో చూస్తా. కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్లు తెస్తా. నీళ్లు తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ మూడు నెలలపాటు జీతం, కారు, ప్యూన్, ఫ్యాన్ ఏమీ వద్దు. నాకు పదవులు ఏం కొత్త కాదు. 13 ఏళ్లు మంత్రిగా చేశాను” – హరీశ్‌రావు, మాజీ మంత్రి సవాల్ విసిరారు.
తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని చెప్పారని, ఒకవేళ అనుమతి ఇచ్చింది నిజమే అయితే రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెడితే రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. తుమ్మిడిహట్టి నిర్మిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లు అయినా తుమ్మిడిహట్టి కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉండగా జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని విమర్శించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారగానే మాటమార్చారని వెల్లడించారు.
మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టవద్దని నిపుణులు చెప్పలేదని, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని నిపుణులు చెప్పినట్లు సీఎం అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. తమ నివేదికను దృష్టిలో పెట్టుకునే మేడిగడ్డ నిర్మించినట్లు నిపుణులు అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. చిల్లర రాజకీయాల కోసం రైతులు, రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టడం దారణమన్నారు వ్యాప్కోస్‌ను చెఫ్‌తో పోలుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారని, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కోసం వ్యాప్కోస్‌ను తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమేనని, చేవెళ్ల-ప్రాణహితకు వ్యతిరేకంగా లేఖలు వచ్చాయని, ప్రత్యామ్నాయం చూపాలని వ్యాప్కోస్‌ను కోరామన్నారు. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్‌కే పనులు అప్పగించిందని, వ్యాప్కోస్‌కు రేవంత్ రెడ్డి పనులు అప్పగిస్తే కరెక్టు మేం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు
మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని ఏ నిపుణుడూ చెప్పలేదని, అక్కడ నిర్మాణానికి అనుకూలంగానే ఉందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సైతం రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఈ విషయాలను అఫిడవిట్ రూపంలో సమర్పించిందని వెల్లడించారు. రైతుల ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డికి రాజకీయాలే ముఖ్యంగా మారాయని, కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుళ్లుతోనే మేడిగడ్డ దగ్గర వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు సాంకేతికతపై మాట్లాడిన హరీశ్ రావు.. ‘మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించవచ్చు కానీ, అక్కడ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ సూచించింది. ఆ నిపుణుల కమిటీ సూచనలను గౌరవించి, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా నీళ్లు తరలించే ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కమిటీ చెప్పిన మార్గదర్శకాల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం’ అని హరీశ్ చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, నీరు లేకుండా ఎలా ఎత్తాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్లు నిల్వ ఉండే ఏకైక ప్రాంతం మేడిగడ్డ కాబట్టే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టారని స్పష్టం చేశారు.
ప్రస్తుత నీటి లభ్యత గణాంకాలను హరీశ్ రావు మీడియా ముందుంచారు. మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం సుమారు 89,230 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. గత మూడు రోజుల్లోనే 3,47,180 క్యూసెక్కుల నీరు కిందకు వెళ్ళిపోయిందని, మంగళవారం ఒక్కరోజే 1.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైందని గుర్తుచేశారు. ఇప్పటివరకు సుమారు 7.5 టీఎంసీల నీరు సముద్రం పాలు కావడం బాధాకరమన్నారు. ‘ఈ నిమిషంలో కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తే కనీసం 3 టీఎంసీల నీటిని సులభంగా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదు. నీళ్లు వృథాగా పోతుంటే చూస్తూ కూర్చోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.’ అని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలు ముఖ్యమా లేక తెలంగాణ రైతాంగ సంక్షేమం ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు.







