Mahaa Daily Exclusive

  బెంగాల్‌లో టీఎంసీకి మరో షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు కీలక నేతలు..!

Share

కొల్‌కతా,మహా.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఎంసీని వీడిన కేంద్ర మాజీ మంత్రి సుష్మితా దేవ్‌తో పాటు పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్, గిరిజన నాయకుడు ప్రకాశ్ చిక్‌బరాయిక్ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికను బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

ఈ సందర్భంగా సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ, రాజ్యసభలో విశేష అనుభవం కలిగిన నాయకులు బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నేతలు బీజేపీలో చేరారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించకుండా విమర్శనాత్మక వైఖరి అవలంబించడం వల్లే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా రాష్ట్ర అభివృద్ధిని రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

 

బీజేపీలో చేరిన అనంతరం సుష్మితా దేవ్ మాట్లాడుతూ, ఒకేసారి రెండు పడవల్లో ప్రయాణించడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు. పదవిని కాపాడుకోవడం కోసం కాకుండా తన రాజకీయ నమ్మకాల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజ్యసభ సభ్యత్వం కోసమే బీజేపీలో చేరాననే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

 

మరోవైపు సుఖేందు శేఖర్ రాయ్ తీవ్రస్థాయిలో టీఎంసీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి పెరగడం, మహిళలపై దాడులు అధికమవడం వంటి పరిణామాల కారణంగా ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌ను బహిరంగంగానే తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ రాజకీయంగా పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్న ఆయన, దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాల్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరినట్లు తెలిపారు.

 

ఇటీవల వరుసగా టీఎంసీకి చెందిన పలువురు నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఈ తాజా చేరికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా సుష్మితా దేవ్, సుఖేందు శేఖర్ రాయ్ వంటి అనుభవజ్ఞులైన నేతలు కమలం గూటికి చేరడం రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest