Mahaa Daily Exclusive

  పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు.. ఇస్లామాబాద్‌కు 48 గంటల అల్టిమేటమ్..!

Share

ముజఫరాబాద్,మహా.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. తమ డిమాండ్లను 48 గంటల్లోగా ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మొత్తం 38 ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వం ముందు అల్టిమేటమ్ ఉంచిన జేఏఏసీ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని తీవ్ర విమర్శలు చేసింది.

 

పాక్ ఆక్రమిత కశ్మీర్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని జేఏఏసీ ఆరోపించింది. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇస్లామాబాద్ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై పూర్తి రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు అక్కడి ప్రజల అభిప్రాయాలను పక్కనబెట్టి కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలను అమలు చేస్తోందని విమర్శించింది.

 

ప్రస్తుతం వివాదానికి కేంద్రబిందువుగా మారింది పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలోని 12 నామినేటెడ్ స్థానాల అంశం. పాక్ నుంచి వలస వచ్చిన సుమారు 4.36 లక్షల మంది ఓటర్లకు ఈ 12 స్థానాలను కేటాయించడం అన్యాయమని జేఏఏసీ ఆరోపిస్తోంది. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని సుమారు 33 లక్షల మంది ఓటర్లకు కేవలం 33 స్థానాలే ఉండడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ విధానం ద్వారా పాక్ ప్రభుత్వం పీఓకే రాజకీయ వ్యవస్థను తన నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

 

ఇటీవల ఈ 12 నామినేటెడ్ స్థానాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉందంటూ పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ తీర్పు ప్రజల్లో అసంతృప్తిని పెంచిందని, ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే నిర్ణయంగా జేఏఏసీ అభివర్ణించింది.

 

ఈ నేపథ్యంలో నామినేటెడ్ స్థానాలను వెంటనే రద్దు చేయాలని జేఏఏసీ డిమాండ్ చేసింది. అలాగే గతంలో ప్రతిపాదించిన జలవిద్యుత్ ప్రాజెక్టులపై చర్చలను పునఃప్రారంభించాలని, నిత్యావసర వస్తువులపై సబ్సిడీలు పెంచాలని, విద్యుత్ చార్జీలను తగ్గించాలని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశాలతో పాటు మొత్తం 38 డిమాండ్లను అధికారుల ముందుంచింది.

 

ఇక జులై 27న పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన వేళ జేఏఏసీ అల్టిమేటమ్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం స్పందించే తీరును బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏఏసీ స్పష్టం చేయడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest