Mahaa Daily Exclusive

  రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్….

Share

హైదరాబాద్, మహా.
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూబ్లీహిల్స్‌లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానయాన రంగ విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, అంతర్జాతీయ విమాన సర్వీసుల పెంపుపై ఇరువురూ చర్చించారు.

తెలంగాణలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్రంలో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రానికి ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరింత విస్తరించాలని మహమ్మద్ సార్థన్‌ను కోరారు.

ముఖ్యమంత్రి విజ్ఞప్తికి ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఏ–380 విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద ఎమిరేట్స్ స్పాన్సర్‌షిప్ అందించాలని ముఖ్యమంత్రి కోరారు. దీనిపై కూడా మహమ్మద్ సార్థన్ సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా మరింత బలోపేతం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో కొత్త విమానాశ్రయాల ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్‌తో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Latest