హనుమకొండ, మహా:
డ్రగ్స్ నిర్మూలనను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించేందుకు మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి మత్తు రహిత సమాజ నిర్మాణ సందేశాన్ని తీసుకెళ్లడంలో మీడియా ముందుండాలని పిలుపునిచ్చారు.
గురువారం హనుమకొండ పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సమాజాన్ని ఆరోగ్యవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడంలో మీడియా ప్రభావం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఈ సామాజిక సమస్యను ఎదుర్కోవడంలో ప్రభుత్వంతో పాటు మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరేలా మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని గవర్నర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా చైతన్యానికి సంబంధించిన అంశాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ప్రజల్లో సామాజిక బాధ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, చట్టాల పట్ల అవగాహన పెంపొందించే దిశగా మీడియా నిరంతరం కృషి చేయాలని కోరారు.
మత్తు రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మీడియా సంపూర్ణ సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగల శక్తి మీడియాకు ఉందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం, మీడియా, ప్రజలు సమష్టిగా కృషి చేసినప్పుడే డ్రగ్స్ రహిత భారత్, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని స్పష్టం చేశారు. యువతను మత్తు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.








