హైదరాబాద్, మహా.
తెలంగాణలో క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు స్పష్టమైన క్రీడా విధానాన్ని రూపొందించామని చెప్పారు. దేశవ్యాప్తంగా క్రీడారంగ అభివృద్ధికి అవసరమైన సమగ్ర విధానాన్ని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గురువారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, ప్రపంచ క్రీడా వేదికపై భారత్ ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిందని అన్నారు. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో పతకాల పట్టికలో భారత్ వెనుకబడటానికి దీర్ఘకాలిక ప్రణాళికల లోపమే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, నాణ్యమైన మౌలిక వసతులు కల్పిస్తేనే ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించగలమని పేర్కొన్నారు.
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు. దేశానికి గర్వకారణమైన క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. ఏ రంగంలోనైనా అంకితభావంతో కష్టపడితే విజయం తప్పకుండా సాధ్యమవుతుందని యువతకు సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
భారత క్రీడారంగానికి పీటీ ఉష చేసిన సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ప్రతిభతో దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన ఆమె అనేక మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. క్రీడల్లో సాధించిన విజయాల ద్వారానే ఆమె దేశ అత్యున్నత వేదికల వరకు చేరుకున్నారని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి సమాజంలో గౌరవం, అవకాశాలు రెండూ లభిస్తాయని అన్నారు.
తెలంగాణను దేశంలోనే క్రీడలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ వేదికగా నిలిచేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ప్రారంభించిన స్పోర్ట్స్ విశ్వవిద్యాలయం రాష్ట్ర క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు.
క్రీడల్లో రాణించే యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆకర్షణీయమైన నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. డిసెంబర్ 2028 నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చే ప్రతి క్రీడాకారుడికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.








