Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్ర..

Share

• సురేశ్ రెడ్డి పదవీకాలం ముగియడంతో కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.

హైదరాబాద్, మహా.

రాజ్యసభలో భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పక్షంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతున్న సురేశ్ రెడ్డి పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఇప్పటి వరకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫ్లోర్ లీడర్‌గా నియమించారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, పార్లమెంట్‌లో ప్రదర్శించిన పనితీరును గుర్తించి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 

రాజ్యసభలో బీఆర్ఎస్ తరఫున కేంద్ర ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరిని బలంగా వినిపించడంతో పాటు తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సమర్థవంతంగా ప్రస్తావించే బాధ్యతలను ఇకపై వద్దిరాజు రవిచంద్ర నిర్వహించనున్నారు. ఈ నియామకం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలకు కారణమైంది.

 

ఈ సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ మాట్లాడుతూ, వద్దిరాజు రవిచంద్రకు ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగించడం బీసీ వర్గాలకు గౌరవప్రదమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన రాజ్యాంగబద్ధమైన నిధులు, పెండింగ్ అంశాలపై పార్లమెంట్‌లో మరింత సమర్థవంతంగా గళం వినిపిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో వద్దిరాజు రవిచంద్ర కీలక పాత్ర పోషిస్తారని మున్నూరు కాపు సంఘం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షానికి ఈ మార్పు మరింత బలం చేకూర్చడంతో పాటు రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో మరింత ప్రభావవంతంగా ప్రస్తావించే అవకాశం కల్పిస్తుందని వారు పేర్కొన్నారు.

Latest