Mahaa Daily Exclusive

  సంగారెడ్డికి నో …….సిద్ధిపేటకు సై….

Share

  • సంగారెడ్డికి నో
  • సిద్ధిపేటకు సై
  • హరీష్ రావుపై పోటీకి సిద్ధమన్న జగ్గారెడ్డి
  • గెలుపు కోసం సీఎం ముందస్తు వ్యూహంతో ఉన్నారని వ్యాఖ్య

హైదరాబాద్, మహా : సంగారెడ్డి నుంచి పోటీ చేసేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధిపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ,సంగారెడ్డి ప్రజలు తనను ఓడించారని, అందుకే అక్కడ పోటీ చేయడం లేదని గతంలోనే ప్రకటించిన జగ్గారెడ్డి తన భార్య నిర్మలా జగ్గారెడ్డి మాత్రం బరిలో ఉంటారని ప్రకటించారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌ చేసిన జగ్గారెడ్డి తాను సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితం కాదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడి నుంచే బరిలో దిగుతానని చెప్పారు. రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకుడైనా పరిస్థితులకు, పార్టీ వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. “ఎంత పెద్దపులి అయినా వేటగాడి వ్యూహంలో పడాల్సిందే.. ఓట్ల రాజకీయం కూడా అంతే. అందుకే నేను కూడా రెండు సార్లు ఓడిపోయా” అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో పార్టీ ఆదేశిస్తే సిద్దిపేటలో బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావుపై పోటీ చేయడానికీ వెనుకాడనని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి పూర్తిగా సమర్థించారు. ప్రతి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, అధికార పార్టీని బలహీనపరచడం రాజకీయాల్లో సహజమేనని అన్నారు. రాజకీయాల్లో కౌంటర్‌, ఎన్‌కౌంటర్‌ కామనేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్‌ సొంత ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందని, అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారని చెప్పారు.

“ఎమ్మెల్యే పనితీరు బాగాలేకపోతే ఎంత తోపు నాయకుడైనా కాంగ్రెస్‌లో టికెట్‌ దక్కడం కష్టం. గతంలో ఎంతో బలమైన నాయకులుగా భావించిన వారు కూడా ఎన్నికల్లో మట్టికరిచారు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం హెచ్చరికలను ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని తమ లోపాలను సరిదిద్దుకోవాలని, లేకపోతే టిక్కెట్ల సమయంలో వారికే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వేల ఆధారంగానే జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై అంచనా వేసే హక్కు సీఎంకే ఉంటుందని, తుది నిర్ణయాన్ని ఏఐసీసీ, రాష్ట్ర ఇన్‌చార్జి, సీఎం, పీసీసీ చీఫ్‌ కలిసి తీసుకుంటారని వెల్లడించారు.

రాబోయే ఎన్నికలపై కూడా స్పందించిన జగ్గారెడ్డి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముందన్న అంచనాతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే 117కుపైగా స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం ముందుగానే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల సర్వేలపై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. “బీఆర్ఎస్‌కు అనుకూల వ్యక్తులతో సర్వే చేస్తే బీఆర్ఎస్‌కే అనుకూల ఫలితాలు వస్తాయి. తెలంగాణలో పెద్దగా బలం లేని బీజేపీ సర్వే చేయించినా బీజేపీకే అనుకూలంగానే ఉంటుంది” అని అన్నారు.

Latest