సింగరేణి బరోసా యాత్రకు శ్రీకారం.
* రెండు రోజుల పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విస్తృత పర్యటన.
హైదరాబాద్, మహా .
సింగరేణి కార్మికుల సమస్యలు, బొగ్గు పరిశ్రమ అభివృద్ధి, గనుల పరిస్థితులపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించుకునేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు “సింగరేణి బరోసా యాత్ర” చేపట్టనున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుతో కలిసి నిర్వహించే ఈ పర్యటనలో సింగరేణి పరిధిలోని పలువురు కార్మికులను కలుసుకోవడంతో పాటు గనులను సందర్శించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ యాత్రకు సంబంధించి పూర్తి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం విడుదల చేసింది.
కొత్తగూడెంతో ప్రారంభం
సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న కేంద్ర మంత్రి బృందం ఉదయం 10 గంటలకు కొత్తగూడెం చేరుకోనుంది. అక్కడ స్థానిక నాయకులతో సమావేశం అనంతరం హాల్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం మణుగూరు బయలుదేరి పీకే ఓసీ-2 గనిని సందర్శిస్తారు. గని వద్ద కార్మికులతో సమావేశమై వారి సమస్యలు, సంక్షేమం, ఉత్పత్తి పరిస్థితులపై చర్చించనున్నారు.
భూపాలపల్లిలో కార్మికులతో సమావేశం
మణుగూరు కార్యక్రమం అనంతరం భూపాలపల్లి చేరుకునే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన హాల్ మీటింగ్‌లో పాల్గొంటారు. సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం భూపాలపల్లిలోనే రాత్రి బస చేయనున్నారు.
రెండో రోజు గనుల సందర్శన
మంగళవారం ఉదయం భూపాలపల్లి కేటీకే-8 గనిని సందర్శించే కేంద్ర మంత్రి అక్కడ కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తాడిచర్ల గనులకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తారు. తర్వాత రామగుండంలోని జీడీకే ఓసీ గనిని సందర్శించి ఉద్యోగులతో సమావేశమవుతారు. సింగరేణి ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
మంచిర్యాలలో ముగియనున్న యాత్ర
రామగుండం కార్యక్రమం అనంతరం మంచిర్యాల చేరుకునే కేంద్ర మంత్రి ఎస్‌ఆర్‌పీ-3 గనిని సందర్శించి కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడనున్నారు. అనంతరం క్యాతనపల్లిలో నిర్వహించే సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులు, సింగరేణి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడితో రెండు రోజుల సింగరేణి బరోసా యాత్ర ముగియనుండగా, సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
సింగరేణి అభివృద్ధిపై దృష్టి
సింగరేణి సంస్థ దేశ బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గనుల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, భద్రతా చర్యలు, ఆధునికీకరణ, భవిష్యత్ విస్తరణ వంటి అంశాలపై కేంద్ర మంత్రి ప్రత్యక్షంగా పరిస్థితులను పరిశీలించనున్నారు. అలాగే కార్మికుల నుంచి నేరుగా అభిప్రాయాలు స్వీకరించి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కార చర్యలు చేపట్టే దిశగా ఈ యాత్ర ఉపయోగపడనుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.








