Mahaa Daily Exclusive

  బుల్లెట్ ట్రైన్ల కారిడార్ గా తెలంగాణపై….

Share

  • బుల్లెట్ ట్రైన్ల కారిడార్ గా తెలంగాణపై
  • కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్
  • వచ్చే ఏడాది ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమని వెల్లడి
  • గేమ్ చేంజర్ గా మారనున్న బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ
  • హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రసంగించిన మంత్రి

హైదరాబాద్, మహా : కొత్తగా 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లను మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని ఇందులోతెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయికి కారిడార్లు ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన వికసిత్ భారత్ -2047లో సాంకేతికత పాత్ర అంశంపై సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్ తెలంగాణకు రైల్వే బడ్జెట్ ను కేంద్రం భారీగా పెంచిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే బడ్జెట్ రూ. 880 కోట్లు మాత్రమేనని కానీ మోడీ ప్రభుత్వం కేవలం తెలంగాణకే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. తెలంగాణకు 4 ఎలక్ట్రానికి పరిశ్రమలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని 3 సెమీ కండక్టర్ల పరిశ్రమల్లో ఇప్పటికే ఒక దాంట్లో ప్రొడక్షన్ ప్రారంభమైందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‍ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ఇచ్చామని వందే భారత్ రైలుతో ప్రపంచంలోని ఏ రైలు కూడా సరితూగదన్నారు.

రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ బుల్లెట్ రైలు హబ్ గా మారనుందన్నారు. కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమని చెప్పారు. రైల్వే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ తెలంగాణకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో రైల్వే విప్లవం నడుస్తుందని కొత్తగా సాంకేతికతను వినియోగిస్తూ.. పూర్తి స్థాయిలో అధునాతన సదుపాయాలతో రైళ్లను అందుబాటు లోకి తీసుకువస్తున్నట్లు వివరించారు. బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 1 గంట 10 నిమిషాల సమయంలో చేరుకోవచ్చని వివరించారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో, ఇక.. హైదరాబాద్ నుంచి చెన్నయ్‌కి రెండు గంటల్లో వెళ్లవచ్చని మంత్రి వివరించారు. బుల్లెట్ రైలు వ్యవస్థ దేశంలో గేమ్ ఛేంజర్ గా మారనుందని వెల్లడించారు. ఈ క్రెడిట్ తీసుకునేలా కొందరు ప్రయత్నాలు చేసారని విమర్శించారు. భారతీయ రైల్వేలో సమూల మార్పులు.. సంస్కర ణల క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని చెప్పారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే భారీ మార్పులు వస్తాయని వివరించారు.

Latest