Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో దేశ తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణకు మరో మైలురాయి.

Share

• రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

హైదరాబాద్, మహా .
సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీ హబ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం ప్రారంభించారు. జపాన్‌కు చెందిన తోహో కోకి సంస్థ సాంకేతిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ హబ్ దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమకు కొత్త ఊపునివ్వనుందని ప్రభుత్వం తెలిపింది.
సెమీకండక్టర్ చిప్‌ల తయారీ ప్రక్రియలో అత్యంత కీలకమైన సీఎంపీ ప్యాడ్ సాంకేతికత ఇప్పటి వరకు విదేశాలపై ఆధారపడగా, ఇకపై హైదరాబాద్‌లోనే ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో దేశంలో చిప్ తయారీ రంగానికి అవసరమైన కీలక మౌలిక వసతులు బలోపేతం కావడంతో పాటు దిగుమతులపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ టెక్నాలజీ హబ్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్ సంస్థలు అత్యాధునిక సెమీకండక్టర్ సాంకేతికతపై శిక్షణ పొందడంతో పాటు పరిశోధన, ఉత్పత్తి రూపకల్పన, ప్రోటోటైపింగ్ వంటి అంశాల్లో ప్రత్యక్ష సహకారం అందుకోనున్నారు. దేశీయంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలవనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, వచ్చే 18 నుంచి 24 నెలల్లో దేశీయంగానే సీఎంపీ ప్యాడ్‌ల తయారీని ప్రారంభించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సెమీకండక్టర్ తయారీకి అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాలను తెలంగాణలోనే అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
జపాన్‌తో సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక సెమీకండక్టర్ టెక్నాలజీల అభివృద్ధికి ఈ హబ్ కీలక వేదికగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధన నుంచి నైపుణ్యాభివృద్ధి, ప్రోటోటైపింగ్, చిప్ తయారీ వరకు పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను తెలంగాణలో నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.
సెమీకండక్టర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఏర్పడుతున్న ఈ తరహా సాంకేతిక కేంద్రాలు రాష్ట్రాన్ని హైటెక్ తయారీ రంగంలో మరింత ముందంజలో నిలబెట్టనున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ హబ్ ఏర్పాటుతో పెట్టుబడులు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest