Mahaa Daily Exclusive

  మళ్ళీ రేవంత్ సీఎం కావడం ఒక కల – కేసీఆర్ తీర్చిదిద్దిన సైనికుడు హరీష్ రావు

Share

  • కాంగ్రెస్ కు కేవలం 78 సీట్లే
  • సర్వే చేయించలేదంటే సీఎం ప్రమాణం చేసి చెప్పాలి
  • గెలుపుపై నమ్మకం ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని సవాల్
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ఒక కలేనని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేలోనే బీఆర్‌ఎస్‌కు 78 సీట్లు వస్తాయని తేలిందని, ఒకవేళ తాను సర్వే చేయించుకోలేదని రేవంత్ భావిస్తే దేవుడిపై ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్‌కు తన పాలనపై, నమ్మకంపై అంత ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలకు వెళ్లాలని, లేదా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని, అదీ కాదంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేదని, ఆయన కేవలం సంచులలో పైసలు నింపి ఢిల్లీకి కట్టే ‘ఈఎంఐ’ ముఖ్యమంత్రి అంటూ తీవ్రంగా ఎద్దేవా చేశారు.

గోదావరి బేసిన్‌లో లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి పారుతున్నా, రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వంతో, గత ప్రభుత్వంపై ఉన్న ద్వేషంతో తెలంగాణ రైతాంగంపై పగబట్టారని కేటీఆర్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో మేడిగడ్డ బ్యారేజీతో ఎలాంటి సంబంధం లేకుండానే, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా కేవలం ఒక్క బటన్ నొక్కి రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు. కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 97 మీటర్లకు చేరిన తరుణంలో నీటిని ఎత్తిపోస్తే రానున్న 100 రోజుల్లో 200 టీఎంసీలను నింపి.. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి రిజర్వాయర్లను నింపవచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం లేఖ రాశారని గుర్తుచేశారు. కానీ, ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతుందనే నెపంతో ప్రజలను మభ్యపెడుతూ, బోడిగుండుకూ మోకాలికీ ముడివేస్తూ నీటిని కిందికి వదిలేస్తున్నారని మండిపడ్డారు.

మేం కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించి అక్కడ నీటి లభ్యతను ప్రజలకు చూపించడంతోనే రేవంత్ రెడ్డి బండారం బయటపడిందని, అందుకే ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకవైపు తెలంగాణ రైతులు సాగునీరు లేక అల్లాడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం తన పాత గురువుకు గురుదక్షిణ ఇచ్చుకోవడానికి నీళ్లన్నీ కిందికి వదిలేస్తూ రైతు ద్రోహి గా మారుతున్నారని ధ్వజమెత్తారు. కన్నెపల్లి దగ్గర నీళ్లు లేకపోతే, మరి కిందికి పోతున్న ఆ నీటితోనే పొరుగు రాష్ట్రంలోని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వందల టీఎంసీలను ఎలా ఎత్తిపోసుకుంటున్నారో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. మేడిగడ్డకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం మునిగిపోతుందంటూ రేవంత్ దారుణమైన అబద్ధాలు చెప్తున్నారని, భద్రాచలానికి ముప్పు పొంచి ఉన్నది పోలవరం ప్రాజెక్టు వల్లే తప్ప కాళేశ్వరంతో కాదని, కానీ తన గురువుపై కోపం వస్తుందనే భయంతో రేవంత్ పోలవరంపై మాట్లాడటం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎత్తు ఒక్కటే తక్కువ అనుకుంటే, బుర్ర కూడా తక్కువేనని ఆయన చేష్టల ద్వారా స్పష్టమవుతోందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉందో కూడా తెలియని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. కాళేశ్వరం పంపులకే కాకుండా దేవాదుల పంపులకు కూడా తాళం వేసి వరంగల్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా కట్టకుండా, పంటలు కొనకుండా వేధిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఖరిని ఇంకో రెండు మూడు వారాలు గమనిస్తామని, అప్పటికీ పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయకుంటే రైతాంగాన్ని ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యాచరణతో తిరగబడతామని హెచ్చరించారు.

నిబద్ధత కలిగిన నేత హరీష్ రావు

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు కేసీఆర్ గారితో కలిసి మొదటి నుండి ఉద్యమ జెండా మోసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడని కొనియాడారు. హరీష్ రావుపై గతంలోనూ ఎన్నో చిల్లర పుకార్లు వచ్చాయని, వాటిని ఆయన పటాపంచలు చేశారని గుర్తుచేశారు. పొద్దున లేస్తే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ, అర్ధరాత్రి కాగానే కేసుల భయంతో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకునే రేవంత్ రెడ్డి లాంటి బ్లాక్‌మెయిలర్ ఇతరుల నిబద్ధతను శంకించడం సిగ్గుచేటని మండిపడ్డారు. దశాబ్దాల పాటు ఒకే పార్టీలో ఉంటూ నిలబడిన నేతలను విమర్శించే నైతిక అర్హత ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్‌కు లేదని, ఇప్పటికైనా చిల్లర వాగుడు బంద్ చేసి రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు.

Latest