- అస్త్ర మార్క్-2 ఉత్పత్తికి ప్రతిపాదనలు కోరనున్న కేంద్రం?
ఢిల్లీ, మహా.
దేశ రక్షణ రంగంలో మరో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అత్యాధునిక క్షిపణుల తయారీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దేశీయ అవసరాలతో పాటు రక్షణ ఎగుమతులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
డీఆర్డీఓ అభివృద్ధి చేసిన అస్త్ర మార్క్-2 గగనతల క్షిపణి తయారీ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశంపై రక్షణ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి త్వరలోనే ప్రతిపాదనలు ఆహ్వానించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది.
ఈ ప్రక్రియలో ఐసీఓఎమ్ఎమ్, అదానీ గ్రూప్, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ తయారీ రంగంలో ఇప్పటికే అనుభవం ఉన్న ఈ సంస్థలు తమ ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
అస్త్ర మార్క్-2 భారత్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన దీర్ఘ శ్రేణి గగనతల క్షిపణి. గరిష్ఠంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, ఇతర గగనతల లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది. చైనాకు చెందిన పీఎల్-15ఈ దీర్ఘ శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణికి పోటీగా దీనిని అభివృద్ధి చేశారు.
ఈ క్షిపణిని తెజస్ మార్క్-1ఏ, మిగ్-29, సుఖోయ్-30 ఎమ్కేఐ, రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించేలా రూపొందించారు. భారత వైమానిక దళం సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో అస్త్ర మార్క్-2 కీలక పాత్ర పోషించనుంది.
ఇటీవల ఇండోనేషియా అస్త్ర క్షిపణుల కొనుగోలుపై ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడినట్లు భావిస్తున్నారు. దేశీయ అవసరాలతో పాటు ఎగుమతి ఆర్డర్లను కూడా సకాలంలో పూర్తి చేయాలంటే ప్రైవేటు రంగం భాగస్వామ్యం అవసరమని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదే సమయంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘ప్రళయ్’ బాలిస్టిక్ క్షిపణి తయారీ బాధ్యతలను కూడా దశలవారీగా ప్రైవేటు రంగానికి అప్పగించే అంశంపై కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విమానాలు, డ్రోన్లు, ఆర్టిలరీ వ్యవస్థలు, యుద్ధ నౌకల తయారీలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెరుగుతుండగా, క్షిపణుల తయారీలోనూ ప్రైవేటు రంగ ప్రవేశం భారత రక్షణ పరిశ్రమలో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.








