Mahaa Daily Exclusive

  ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ..

Share

  • ‘సామాజిక సేవ, సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి అరుదైన గుర్తింపు.

ముంబై, మహా.

ఫార్చూన్ ఇండియా విడుదల చేసిన మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్–2026 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, సంస్థాగత నిర్మాణం, సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సేవల్లో ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు ఫార్చూన్ ఇండియా వెల్లడించింది.

 

ఈ ఏడాది జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా రెండో స్థానంలో నిలవగా, అపోలో హాస్పిటల్స్‌కు చెందిన రెడ్డి సిస్టర్స్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రధాన నిర్వహణాధికారి అపర్ణ బావా నాలుగో స్థానంలో, ప్రపంచ బ్యాంకు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన ఆర్థిక అధికారి అంషులా కాంత్ ఐదో స్థానంలో నిలిచి భారత మహిళా నాయకత్వానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.

 

రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, క్రీడలు, విపత్తు సహాయ కార్యక్రమాల్లో నీతా అంబానీ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా పది కోట్లకు పైగా ప్రజలకు, అందులో కోట్లాది మంది పిల్లలకు ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం చేకూరినట్లు ఫార్చూన్ ఇండియా పేర్కొంది.

 

ఫార్చూన్ ఇండియా ఈ జాబితాను కేవలం వ్యాపార విజయాల ఆధారంగానే కాకుండా, సంస్థలపై చూపిన ప్రభావం, నాయకత్వ సామర్థ్యం, ఆర్థిక వ్యవస్థకు చేసిన సేవలు, నవీన ఆలోచనలు, సామాజిక బాధ్యత, దేశాభివృద్ధిలో పోషించిన పాత్ర వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందిస్తుంది. ఈ జాబితాలో స్థానం పొందడం భారత కార్పొరేట్ రంగంలో అత్యున్నత గుర్తింపులలో ఒకటిగా భావిస్తారు.

 

ఈ గుర్తింపు ద్వారా భారత మహిళలు ప్రపంచ వ్యాపార, ఆర్థిక, సాంకేతిక, ఆరోగ్య రంగాల్లో మరింత ప్రభావవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మరోసారి స్పష్టమైంది. భారత ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర నిరంతరం పెరుగుతోందనే విషయాన్ని ఈ జాబితా ప్రతిబింబిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.