Mahaa Daily Exclusive

  టీవీకేతో పొత్తుపై డీఎంకే ససేమిరా.. కాంగ్రెస్ వైఖరిపై ఆగ్రహం..!

Share

చెన్నై, మహా .

తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య టీవీకేతో పొత్తు అంశం చర్చకు దారితీయడంతో ఇండియా కూటమిలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో చేతులు కలపాలన్న ప్రతిపాదనకు డీఎంకే స్పష్టంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) సానుకూలంగా స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

 

వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో మాత్రం ఇండియా కూటమిలో కలిసి పనిచేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు తెలిపినప్పటికీ, డీఎంకే మాత్రం టీవీకేతో ఎలాంటి పొత్తుకు సిద్ధంగా లేదని స్పష్టం చేసింది.

 

ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ గణపతి పి. రాజ్‌కుమార్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొమ్మిదేళ్లుగా తమతో కలిసి ప్రయాణించిన కాంగ్రెస్ ఇప్పుడు టీవీకేకు మద్దతు ఇవ్వడం వెన్నుపోటుతో సమానమని ఆరోపించారు. మంత్రి పదవుల కోసమే కాంగ్రెస్ డీఎంకేను దూరం చేసుకుందని, ఇప్పుడు వీసీకేను మధ్యవర్తిగా ఉపయోగించి మళ్లీ డీఎంకేను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

 

కేరళ, పశ్చిమ బెంగాల్‌లో అమలైన రాజకీయ సమీకరణాలు తమిళనాడులో పనిచేయవని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీవీకే మూడో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని, దీనివల్ల రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.

 

పార్లమెంట్‌లో ప్రస్తుతం ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగస్వామిగా పరిగణించాలా అనే అంశంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చడమే బీజేపీ లక్ష్యమని, సిద్ధాంతపరంగా బీజేపీయే డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థిగా కొనసాగుతుందని చెప్పారు.

 

డీఎంకే-కాంగ్రెస్ మధ్య ఇటీవల ఏర్పడిన విభేదాలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదని, ఇరు పార్టీల మధ్య మునుపటి స్థాయి విశ్వాసం పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టే అవకాశముందని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం డీఎంకేకే కాకుండా ఇండియా కూటమి ఐక్యతపైనా ప్రభావం చూపే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.