Mahaa Daily Exclusive

  కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కారు విఫలం..! సీఎం రేవంత్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు బహిరంగ లేఖ..

Share

హైదరాబాద్, మహా.

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన సిఫార్సులను రెండున్నరేళ్లుగా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోలేదని రామచందర్‌రావు లేఖలో పేర్కొన్నారు. బ్యారేజీల దెబ్బతినడానికి గత ప్రభుత్వ వైఫల్యాలు కారణమైనప్పటికీ, వాటి మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎన్‌డీఎస్‌ఏ ఇప్పటికే పలుమార్లు నివేదికలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.

 

బ్యారేజీల ఆరోగ్య పరీక్షలు, భూభౌతిక అధ్యయనాలు, నిర్మాణ భద్రతా పరీక్షలు, హైడ్రాలిక్ పరిశీలనలు, పగుళ్ల మ్యాపింగ్, ఇతర సాంకేతిక పరీక్షలు ఒకటి నుంచి రెండు పని సీజన్లలో పూర్తి చేయవచ్చని ఎన్‌డీఎస్‌ఏ సూచించినప్పటికీ ప్రభుత్వం మూడు సీజన్లు గడిచినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కారణంగా గోదావరి జలాల్లో సుమారు 200 టీఎంసీల వినియోగం నిలిచిపోయిందని, కరవు పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.

 

కాళేశ్వరం పునరుద్ధరణ కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వం మాత్రమే ఇస్తుందని, అసలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదేనని రామచందర్‌రావు తెలిపారు. కమిటీపై బాధ్యత నెట్టివేస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

 

మేడిగడ్డ వద్ద గేట్లు తెరిచి ఉంచినా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ త్వరగా పూర్తయి ఉంటే ఉత్తర తెలంగాణలో 20 నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కూడా మెరుగుపడేదని లేఖలో పేర్కొన్నారు.

 

విజిలెన్స్ కమిషన్ నివేదిక, న్యాయమూర్తి పి.సి. ఘోష్ కమిషన్ నివేదికలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని రామచందర్‌రావు ఆరోపించారు. విజిలెన్స్ నివేదికను బహిర్గతం చేసి, బాధ్యులపై తీసుకున్న చర్యలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్థవంతంగా వాదించలేదని, సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా చేయలేదని విమర్శించారు.

 

కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దర్యాప్తు పరిధిని కేవలం మూడు బ్యారేజీల నిర్మాణ లోపాలకే పరిమితం చేసిందని రామచందర్‌రావు ఆరోపించారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం, పంప్ హౌస్‌లు, కాల్వలు, సొరంగాలు, జలాశయాలు, ఇతర నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు మానేసి, కాళేశ్వరం జలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రికి సూచించారు.