జగిత్యాల, మహా .
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, బీఆర్ఎస్ నిధులు, రాష్ట్ర పరిపాలన, స్థానిక రాజకీయాలపై పలు అంశాలను ప్రస్తావిస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకున్నారు. జగిత్యాల పర్యటన సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర పరిపాలన, విద్యాశాఖ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని అర్వింద్ ఆరోపించారు. పాలనలో అనుభవం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద నుంచి పరిపాలన పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై పీకే ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అవినీతిపై నిర్ణయాత్మక చర్యలకు బదులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, రాష్ట్ర పరిపాలనను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా వచ్చాయని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్, హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హరీశ్ రావు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానేసి నిజాలను బయటపెట్టాలని అర్వింద్ అన్నారు. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేయడం కంటే ముందుగా కేసీఆర్‌ను ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర పాలన మొత్తం ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో కూడబెట్టిన వేల కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని, ప్రజల్లో మాత్రం ఆ పార్టీ విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిందని విమర్శించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై కూడా అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన తెలంగాణలోనే అత్యంత విఫలమైన ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన ఆయనకు ప్రజల్లో ఆదరణ లభించదని అన్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్‌కు దూరం చేసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్రం కోరిన 10 ఎకరాల భూమికి బదులుగా కేవలం 2 ఎకరాలు మాత్రమే కేటాయించడం బాధాకరమని అర్వింద్ పేర్కొన్నారు. అవసరమైన 10 ఎకరాల భూమి కేటాయించే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కేంద్రం నిధులు ఇవ్వదని విమర్శించిన నాయకులే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాక కేంద్ర నిధులు కావాలని కోరడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
కేంద్ర పథకాల అమలుకు అవసరమైన లబ్ధిదారుల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించకపోవడం వల్లే కొన్ని నిధులు నిలిచిపోయాయని అర్వింద్ తెలిపారు. బీజేపీకి చెందిన సర్పంచ్‌లను పార్టీ మారేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే నిధులను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఇది బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతికి కొనసాగింపేనని విమర్శించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనతో విసిగిపోయారని అర్వింద్ అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు సాగుతుందని, తెలంగాణలో రాజకీయ మార్పుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.








