Mahaa Daily Exclusive

  మూడు కార్పొరేషన్ లు మావే..: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. 

Share

హైదరాబాద్, మహా : రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్లపై బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ఈ మూడింటిలోనూ బిజెపి మేయర్లే పీఠాన్ని అధిరోహిస్తారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, జీహెచ్ఎంసీ ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఆదివారం కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివేకానంద కాలనీలో బిజెపి నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పూర్వం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన హన్మంతరావు పార్టీ కోసం విరాళంగా ఇచ్చిన స్థలంలోనే ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పార్టీ పెద్దఎత్తున విజయం సాధించడానికి ఈ కార్యాలయమే ప్రధాన వ్యూహ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలంతా బిజెపి వైపు ఆశగా చూస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ఈ మూడు చోట్లా బిజెపి మేయర్లే పీఠాన్ని అధిరోహిస్తారని స్పష్టం చేశారు.

 

మరోవైపు హైదరాబాద్ నగరంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని మండిపడ్డారు. నగరంలో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి ఉందని, వర్షాకాలం వచ్చేలోపు వరద ముంపు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని బిజెపి మొదటి నుంచి హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, పడిన చిన్నపాటి వానలకే నగరం జలమయమై ట్రాఫిక్ స్తంభిస్తోందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఎంఐఎంతో దోస్తీ చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయే తప్ప, నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. అందుకే విసిగిపోయిన నగర ప్రజలు ఈసారి బిజెపికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.