- ఓటరు జాబితాలో పేరు లేనివారు తన దృష్టిలో చనిపోయినట్టే.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓటరు జాబితా ప్రాధాన్యంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో పేరు లేని వారిని తన దృష్టిలో చనిపోయినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే అలాంటి వారికి ప్రభుత్వ పింఛన్‌లు ఎందుకు ఇవ్వాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలా అందించాలని ఆయన ప్రశ్నించారు.
ప్రజలు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకోవడం వారి బాధ్యతేనని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే కనీస ఓపిక కూడా లేని వారు సమాజం గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణల విషయంలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే వివరాలను ధ్రువీకరించుకోవాలని ఆయన సూచించారు. స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు వివిధ వర్గాల్లో చర్చకు దారితీశాయి.








