- – అనుమతులు లేకుండానే ఆహార పదార్థాల తయారీ.
- – లక్ష 32 వేల విలువగల 960 కేజీల అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని సీజ్.
- – రసాయనరంగులతో స్వీట్స్ తయారీ.
- – జిల్లాలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడులు.
- – విస్తు పోయే నిజాలు వెల్లడించిన అధికారులు
- – అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి.జ్యోతిర్మయి.
కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా మారింది ఖమ్మంలోని కొన్ని రెస్టారెంట్ల పరిస్థితి. తినే ఆహారాల వంటకు ఉపయోగించే ప్రతీది కల్తీచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమారుతున్నారు కల్తీ కేటుగాళ్ళు. గొప్పగా చెప్పుకునే హోటల్స్, స్వీట్ షాపుల్లో అధికారుల తనిఖీలతో బయటపడిన అసలు విషయం. అక్కడికక్కడే నోటీసులు జారీ చేసి, మిగతా వ్యాపారులకు కూడా హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. పూర్తి వివరాలు మహా కథనంలో..
ఖమ్మం, నవంబర్ 18, మహా: కల్తీ ఆహార పదార్థాలకు ఖమ్మం కేరాఫ్ గా నిలిచింది. గొప్పగా చెప్పుకొనే రెస్టారెంట్, హోటల్స్, స్వీట్ తయారీ కేంద్రాలు ఇలా అన్నిటిలలో అడుగడుగునా కల్తీలు జరుగుతున్నాయి. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన పదార్థాలను చాలా తేలికగా ఆహారాల తయారీలో విచ్చలవిడిగా వినియోగించడం ఖమ్మంలో పరిపాటిగా మారింది. సోమవారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు పలు ఆశ్చర్యకరమైన బయటకు వచ్చాయి. ఆహార తయారీ కేంద్రాల్లో తయారుచేసిన 960 కేజీల నకిలీ అల్లం పేస్టును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా క్యాన్సర్ కు కారణమయ్యే హానికరమైన రసాయనరంగులను యథేచ్చగా స్వీట్ తయారీలో ఉపయోగించడాని అధికారులు గుర్తించారు.
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ పి. రోహిత్ రెడ్డి, పి. స్వాతి, పి. మనోజ్ కుమార్, బి. రతన్ రావులతో కూడిన బృందం ఖమ్మం పట్టణంలో రిక్కా బజార్ లోని మ్యాజిక్ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు జరపగా, తనిఖీల్లో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.
ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లైసెన్స్ లేకుండా తయారీ, స్టోరేజ్, విక్రయ యూనిట్ చట్ట బద్ధమైన లైసెన్స్ లు లేకుండా బిజినెస్ నిర్వహిస్తున్నందునా, అల్లం వెల్లుల్లి మిశ్రమాల యొక్క బాటిల్స్ పై లేబుల్ లోపాలు బ్యాచ్ నెంబర్, ఎఫ్ఎస్ సీఐ లోగో తయారీ, రీప్యాకింగ్, చిరునామా సరైన వివరాలు లేనందున, నిర్వహణ లోపాలు నిల్వ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను డిటర్జెంట్లు, ఫినాయిల్ వంటి రసాయనాల పక్కనే నిల్వ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి తినే ఆహార పదార్థాలు డిటర్జెన్సీ ఫినాయిల్ వంటి కెమికల్స్ తో క్రాస్ కంటామినేషన్ జరగడం, అది నకిలీ పేస్ట్ అని అనుమానం, పేస్ట్‌లో దుర్గంధం ఉండటం, అతి తక్కువ ధరకు రిటైలర్లకు విక్రయం చేయడం, తద్వారా నాణ్యతా లోపాలు, కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ గా అనుమానించి నమూనాలు సేకరించి, రూ. లక్ష 32 వేల విలువగల 960 కేజీల అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని సీజ్ చేసి, సేకరించిన నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.
చర్చి కాంపౌండ్ లో గల విజయలక్ష్మి పిండి వంటలలో పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్న వంట గదిలో ఆహార పదార్థాలు తయారు చేయడం, కేన్సర్ కారకాలైనటువంటి రసాయన రంగులను అధిక మోతాదులలో స్వీట్లలో ఉపయోగించడం, బ్యాచ్ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, లైసెన్స్ నెంబర్ లేనటువంటి 6,550 రూపాయల విలువ గల మిస్ బ్రాండెడ్ పిండి వంటలను, పచ్చళ్లను, ఇతర దుమ్ము, ధూళి అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఆహారాలను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేసి, పలు అనుమానిత శాంపిల్లను సేకరించి పరీక్ష నిమిత్తం తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నందుకు గాను వారికి నోటీసులు, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. అలాగే మయూరి బజార్ లో గల హరి స్వీట్ హోమ్ లో తనిఖీ చేయగా పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో తయారీ నిర్వహించడం, అధిక మోతాదులో రసాయన రంగులను వాడడం, ఎక్స్ పైర్ కలర్ స్పేస్ టాపింగ్ క్రీమ్స్, మిల్కీ మిస్టర్ క్రీమ్, ఇతర పదార్థాలు సుమారు 6950 రూపాయలు ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేసి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ చట్టానికి విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నందుకుగాను నోటీసులు జారీ చేశారు.
ఖమ్మం పట్టణంలోని కొందరు వ్యాపారులు తయారుచేసి, విక్రయించే ఆహార పదార్థాలలో అధిక మోతాదులో రంగులు వినియోగించడం, అనారోగ్యకరమైన పరిసరాలలో ఆహార పధార్థాలు తయారు చేయడం, ప్రమాదకరమైన రంగులను ఉపయోగించడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయించడం, మిస్ బ్రాండింగ్ ఐటమ్స్ ని కొంతమంది అవగాహన లేక అది తక్కువ సమయంలో అధిక లాభార్జన కోసం ఆహారాన్ని కల్తీ చేయడం వంటి చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇంకా ఆహార తయారీలో కీటకాలు, దుమ్ము, బూజు వంటి నాణ్యతా లోపాలున్న ముడి పదార్థాలను ఉపయోగించడం, వంట నూనెలను పదేపదే మరిగించడం వంటి చర్యలు అల్సర్, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి దారితీసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులు ప్రజలకు సురక్షితమైనవి అందించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించని, అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే సీజ్ చేస్తామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం హెడ్ వి. జ్యోతిర్మయి తేల్చిచెప్పారు. ప్రజల ఆరోగ్యం రక్షణ కోసం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని, వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు.








