Mahaa Daily Exclusive

  ఇండియా అంటే ఇందిరా.. ఇందిరా అంటే ఇండియా..

Share

  • – నాడు దేశవ్యాప్తంగా మార్మోగిన ఒకే ఒక పేరు
  • – పట్టు వదలకుండా విజయల బాట
  • – నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి

 

‘ఇండియా అంటే ఇందిరా.. ఇందిరా అంటే ఇండియా’ అనే మాట దేశవ్యాప్తంగా నాడు మార్మోగింది. ‘ఇందిరా మాటలు తూటల్లా ఉంటాయి.. ఆమె నిర్ణయాలు వ్యూహాత్మకంగా ఉంటాయి.. ఇందిరా ఒక పవర్ ఫుల్ లేడీ’ ఈ మాటలు అప్పుడు బాగా వినిపించేవి. నాటిరోజుల్లో ఆమె పేరు విరివిగా వినిపించేది. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా పలువురు నేతలు, ప్రజలు గుర్తుచేస్తూనే ఉంటారు. నేడు భారతదేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా మహా ప్రత్యేక కథనం.

 

నవంబర్ 19, 1917లో భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ నెహ్రూ – కమలా నెహ్రూ దంపతులకు ఇందిరా గాంధీ జన్మించారు. భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరా గాంధీ తన పాలనలో తనదైన ముద్ర వేశారు. నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన ఆమె ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా బ్యాంకులను జాతీయం చేయడం. 1966లో ఆమె ఇండియాకు ప్రధానమంత్రి అయ్యారు. అయితే, అప్పటికే భారతదేశం చాలా కష్టాల్లో ఉంది. నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్భణంతో పాటు చాలా సమస్యలు ఇండియాలో తాండవమాడుతున్నాయి. ఇందిరా ప్రధాని అయిన తరువాత వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ఇవే కాదు.. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఈ విషయంలో ఇందిరాది కీలక పాత్ర. ఆమె పట్టు వదలకుండా పాకిస్థాన్ పై విజయం సాధించారని చెబుతుంటారు. అందుకే.. అప్పటి ప్రతిపక్ష నేత వాజ్ పేయి.. ఇందిరా గాంధీని కనకదుర్గ అని సంబోధించేవారంటా. అయితే, ఎమర్జెన్సీ తరువాత కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ తరువాత మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రణాళికలు రచించి, అనుకున్నట్లే విజయం సాధించారు. ఆ తరువాత తన దైన పాత్రను మార్క్ ను చూపిస్తూ వచ్చారు. ప్రజలకు చేరువయ్యేలా పథకాలు అమలు చేశారు. అందుకే ఆమె పేరు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోళ్లలో ఆడేది.

 

ఇంగ్లీష్ తోపాటు పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఇందిరా గాంధీ.. రాజకీయాలే కాదు రచనల్లోనూ ఆమె తన ప్రత్యేకతను చూపేవారు. పలు పుస్తకాలను ఇందిరా గాంధీ రచించారు. వాటికి మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో విజయాలను అందుకున్న ఇందిరా గాంధీ భారత రత్న పురస్కారాన్ని స్వీకరించారు. పలు వీదేశీ అత్యున్నత పరుస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. ఇందిరా గాంధీ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇటు రాష్ట్రాల్లో కూడా ఆమె పేరు మీద పలు ప్రత్యేక పథకాలు కొనసాగుతున్నాయి.

 

తెలంగాణతోనూ ప్రత్యేక అనుబంధం

ఇందిరా గాంధీకి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1980 ఎన్నికల్లో యూపీలోని రాయ్ బరేలీ, తెలంగాణలోని మెదక్ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. రెండు స్థానాల్లోనూ గెలవడంతో రాయ్ బరేలీ స్థానాన్ని వదలుకుని, మెదక్ ఎంపీగా కొనసాగారు.