Mahaa Daily Exclusive

  20 న గోద్రెజ్ ఆయిల్ పామ్ ప్రారంభోత్సవానికి సీఎం రాక…

Share

 

ఖమ్మం, మహా.
ఈనెల 20వ తేదీన వైరా నియోజకవర్గంలోని కొణిజెర్ల మండలం అంజనాపురంలో నూతనంగా నిర్మించిన గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి అంశాన్ని ప్రోటోకాల్‌కు అనుగుణంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం అంజనాపురంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, ఫ్యాక్టరీ పరిసరాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

పర్యటనలో ప్రతి నిమిషం ప్రణాళికాబద్ధంగా సాగేందుకు ముందుగానే మినిట్ టు మినిట్ కార్యక్రమ షెడ్యూల్ సిద్ధం చేసి, అన్ని శాఖలు అదే ప్రకారం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సభా వేదికను సుమారు వంద మంది బరువును తట్టుకునే విధంగా నిర్మించడంతో పాటు ప్రోటోకాల్‌కు అనుగుణంగా డయాస్‌పై సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలోని ప్రతి గ్యాలరీకి స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీ కేటాయించాలని, వీఐపీ పాస్‌ల జారీ అవసరమైన పరిమితిలోనే ఉండాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు అత్యంత ప్రాధాన్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు శాఖకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మీడియా, అధికారులు, వీఐపీలు, వీవీఐపీలకు వేర్వేరు ప్రవేశ మార్గాలు కల్పించాలని ఆదేశించారు. సభా ప్రాంగణంలో అవసరమైన బారికేడింగ్ పూర్తిచేయడంతో పాటు ప్రభుత్వ, వీఐపీ, ఇతర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు.

కార్యక్రమ నిర్వహణలో సాంకేతిక అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆడియో, వీడియో వ్యవస్థల్లో ఎలాంటి లోపాలు ఉండకుండా ముందస్తు పరీక్షలు నిర్వహించాలని, గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించే అంశాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, గోద్రెజ్ సంస్థ తరఫున ప్రసంగించే ప్రతినిధి వివరాలను ముందుగానే ఖరారు చేసి అధికారులకు అందజేయాలని ఆదేశించారు.

సభా ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించిన కలెక్టర్, ముఖ్యమంత్రి, మంత్రులకు అందించే ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారి స్వయంగా తనిఖీ చేసి ధృవీకరించాలని చెప్పారు. తాగునీటి కొరత లేకుండా అవసరమైన మేర సురక్షిత త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు.

వైద్య, ఆరోగ్య పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర వైద్య బృందాలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లు, అవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉండేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమం మొత్తం నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడిన పరిస్థితుల్లో వెంటనే వినియోగించేందుకు తగిన ఇంధనంతో స్టాండ్‌బై జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

గోద్రెజ్ అగ్రోవెట్ సంస్థ ప్రతినిధులతో అన్ని శాఖల అధికారులు నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చిన్న లోపానికీ అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్‌తో పాటు పోలీసు, ఆర్ అండ్ బి, వైద్య, ఉద్యానవన, పంచాయతీ, ఆహార భద్రత, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, గోద్రెజ్ అగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.