Mahaa Daily Exclusive

  ప్రభుత్వంపై ప్రతిపక్షాల విరుచుకుపాటు….

Share

ప్రభుత్వంపై ప్రతిపక్షాల విరుచుకుపాటు.
• నీట్ లీక్, అయోధ్య విరాళాల వ్యవహారాలపై చర్చకు డిమాండ్.
• ‘ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అణిచివేస్తోంది’ అని ఖర్గే ఆరోపణ.
ఢిల్లీ, మహా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఇరుకున పెట్టాయి. నీట్–2026 ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, పారదర్శక దర్యాప్తు వంటి అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరపాలని ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం బలప్రయోగంతో అణచివేస్తోందని ఆరోపించారు.

రాజ్యసభలో మాట్లాడిన ఖర్గే, నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా బలప్రయోగానికి దిగుతోందని విమర్శించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, వారిని బలవంతంగా చెదరగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం గళమెత్తిన వారిని అణచివేయడం సరికాదని అన్నారు.

నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై సమగ్ర చర్చ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశంతో పాటు అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపైనా సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను వాయిదా వేశారు.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, జైరాం రమేశ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సౌగతా రాయ్, సాగరికా ఘోష్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, జేఎంఎం ప్రతినిధులు, సీపీఐ(ఎం) నాయకులు జాన్ బ్రిట్టాస్, పి. సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే, అయోధ్య శ్రీరామమందిర నిర్మాణం కోసం కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో విరాళాలు అందించారని గుర్తుచేశారు. ఆ నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించి పూర్తి లెక్కలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలైనా వెలుగులోకి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నీట్‌తో పాటు ఇతర నియామక, ప్రవేశ పరీక్షల్లో తరచూ జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలపై కూడా ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 152 పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటి ప్రభావంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానంపైనా కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు చేశారు. దేశంలోని కోట్లాది మంది వాహనదారులపై సరైన శాస్త్రీయ అధ్యయనం లేకుండానే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని, ప్రజలపై అదనపు భారం మోపే విధానాలకు ప్రభుత్వం తెరలేపుతోందని ఆరోపించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని చేసిన ప్రసంగంలో నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల వ్యవహారం వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని, దేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఎక్స్ వేదికగా విమర్శించారు.

పార్లమెంట్ తొలి రోజే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఉమ్మడిగా దాడి ప్రారంభించడంతో వర్షాకాల సమావేశాలు రాజకీయంగా మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నీట్ వివాదం, అయోధ్య విరాళాల వ్యవహారం, పేపర్ లీకేజీలు, ప్రజాస్వామ్య హక్కులు, డీలిమిటేషన్ వంటి అంశాలపై రానున్న రోజుల్లో ఉభయ సభల్లో తీవ్ర వాగ్వాదం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.