- రణరంగంగా మారిన సీజేపీ చలో సంసద్
- పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
- సీజేపీ అధ్యక్షుడు అరెస్ట్
- ఆందోళనల్లో పలువురు పోలీసులకు గాయాలు
- చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా దళాలు
న్యూఢిల్లీ, మహా : విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు అనుమతి నిరాకరించినా ఆందోళనకారులు పార్లమెంటు వైపుగా దూసుకెళ్లడంతో వారిపై భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించి, చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ కూడా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘చలో సంసద్’కు సీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌కు బయలు దేరిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకోవడంతో పోలీసు సిబ్బంది కొందరికి గాయాలయ్యాయి. భద్రతా దళాలపై సీజేపీ కార్యకర్తలు చెప్పులు, వాటర్ బాటిళ్లను విసిరారు.
ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేతో పలువురు నిరసనకారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేశారు. కార్యకర్తలను ‘శాంతంగా ఉండాలని’ సీజేపీ కోరింది. ‘‘మనల్ని అడ్డుకుంటున్నప్పటికి సంయమనం పాటించి.. శాంతిని కాపాడండి. మనం శాంతి, ప్రేమతో మాత్రమే దీనిని గెలుస్తాం’’ అని ఆ పార్టీ పేర్కొంది. పార్లమెంట్ వద్ద ఆందోళనకు అనుమతి నిరాకరించిన పోలీసులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండే సమూహాలను నిషేధించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇప్పటికే నిరాహార దీక్ష చేస్తోన్న ప్రముఖ సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందజేస్తోన్న విషయం తెలిసిందే.
‘‘ముందస్తు అనుమతితో జంతర్ మంతర్ వద్ద నిర్దేశించిన ప్రదేశంలో తప్ప, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ఆందోళనలు, సమావేశాలు నిషేధం’’ అని ఎక్స్ (ట్విట్టర్)లో ఢిల్లీ పోలీసులు ఒక పోస్ట్ పెట్టారు. ‘‘పౌరులందరూ చట్టాన్ని గౌరవించాలి.. ఎలాంటి అనధికారిక సమావేశాలు లేదా ప్రదర్శనలలో పాల్గొనవద్దు.. శాంతిభద్రతల పరిరక్షణను కాపాడటంలో సహకరించాలి’’ అని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేయడంతో ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలో కూడా గందరగోళం నెలకొంది. వందలాది మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో చిక్కుకుపోయారు.








