Mahaa Daily Exclusive

  ఆపదలో అండగా… ఆర్టీసీ ఒకే కుటుంబం….

Share

  • ఆపదలో అండగా
  • ఆర్టీసీ ఒకే కుటుంబం
  • కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మహా : టీజీఎస్ఆర్టీసీ కేవలం ఒక రవాణా సంస్థ మాత్రమే కాదని, వేలాది మంది ఉద్యోగుల ఉమ్మడి కుటుంబమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన దివంగత డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు ‘చేయూత’ కార్యక్రమం ద్వారా స్వచ్ఛందంగా సేకరించిన రూ. 90,85,500 (తొంభై లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయల) భారీ ఆర్థిక సహాయ చెక్కును సోమవారం ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శంకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ వై.నాగిరెడ్డిల చేతుల మీదుగా దివంగత డ్రైవర్ సతీమణి హేమలత, కుమారుడు హేమంత్, కుమార్తె షాలినిలకు ఈ చెక్కును అందజేసి సంస్థ తరఫున పూర్తి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత కోల శంకర్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులందరూ అండగా నిలవడం వారి మానవత్వానికి నిదర్శనమన్నారు. శంకర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో అర్ధరాత్రి వేళ స్వయంగా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అందులో భాగంగానే దివంగత శంకర్ కుమారుడు హేమంత్‌కు ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తున్నామని, అలాగే ఆ కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేశామని ప్రకటించారు. ఆర్టీసీలోని ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వం నెలకు రూ. 300 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తోందని, ఈ పథకం వల్ల పనిభారం పెరిగినప్పటికీ సిబ్బంది ఎంతో కష్టపడి విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రాఖీ పౌర్ణమి వంటి పండుగ రోజుల్లోనూ మహిళా ప్రయాణికుల కోసం కార్మికులు తమ సోదరులకు రాఖీ కట్టి మరీ విధులు నిర్వహించడం వారి నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు.

కార్మికుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని మంత్రి స్పష్టం చేశారు. రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌలభ్యం, కార్మికుల సంక్షేమం అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా సంస్థను ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్మిక సంఘాల ఎన్నికల అనంతరం నలుగురు మంత్రులు, అధికారుల కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీ విలీన ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే క్యూర్ ఏరియా పరిధిలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మిస్తామని, గ్రామాల నుండి రాజధాని వరకు కొత్త రూట్లలో బస్సులు నడుపుతూ, మెట్రో మరియు ఎంఎంటీఎస్ సర్వీసులతో ఆర్టీసీని అనుసంధానం చేసి రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ పేదవాడి గుండె చప్పుడు అని, కాబట్టి యాజమాన్యం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి చర్యల్లో ఉద్యోగులంతా మరింత బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ తోటి ఉద్యోగి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సంస్థలోని సిబ్బంది అంతా ఏకతాటిపైకి వచ్చి రూ. 90.85 లక్షల భారీ ఆర్థిక సహాయాన్ని అందించడం ఆర్టీసీ ఉద్యోగులలో ఉన్న అంతర్గత బంధానికి, పరస్పర సహకారానికి ఒక గొప్ప నిదర్శనమన్నారు. సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఒక ఉద్యోగి కష్టంలో ఉంటే మొత్తం సంస్థ అండగా నిలవాలనే గొప్ప సంస్కృతి టీజీఎస్ ఆర్టీసీ సొంతమని, ఈ కార్యక్రమం ఆ విలువలను మరోసారి చాటిచెప్పిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం యాజమాన్యం కట్టుబడి ఉందని, సిబ్బందికి అవసరమైన భద్రత, శిక్షణ, పని పరిస్థితుల మెరుగుదల కోసం నిరంతర చర్యలు తీసుకుంటున్నామని ఎండీ స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని, ప్రతి డ్రైవర్, కండక్టర్ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహిస్తూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని, వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సంస్థ ఆర్థిక బలోపేతంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కూడా సమానంగా ముఖ్యమని యాజమాన్యం విశ్వసిస్తోందని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తాము అందుబాటులో ఉంటామన్నారు.