విక్రమ్-1 విజయంతో అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం.
* శాస్త్రవేత్తల ప్రతిభకు, మోదీ దార్శనికతకు నిదర్శనమని ఎన్. రాంచందర్ రావు ప్రశంస.
హైదరాబాద్, మహా.
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిన విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 ప్రయోగం భారత శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభకు, ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న దూరదృష్టి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన ఇస్రో, విక్రమ్-1 బృందం, దేశ శాస్త్రవేత్తలందరికీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున, వ్యక్తిగతంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రయోగానికి ముందు చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కేవలం 35 నిమిషాల్లోనే లోపాన్ని సరిచేసి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం భారత శాస్త్రవేత్తల నైపుణ్యానికి నిదర్శనమని రాంచందర్ రావు కొనియాడారు. ఈ విజయం ప్రపంచ వేదికపై భారత అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పిందని, యావత్ దేశం గర్వించే విజయంగా నిలిచిందన్నారు.
విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించిన స్కైరూట్ సంస్థ తెలంగాణలో, హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు రంగాన్ని అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యం చేస్తూ దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగని అభిప్రాయపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమాల స్ఫూర్తితో దేశీయ సాంకేతికతకు కొత్త ఊపిరి లభించిందని రాంచందర్ రావు అన్నారు. విక్రమ్-1 విజయం ఆ సంకల్పానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ప్రయోగాన్ని స్వయంగా వీక్షించిన ప్రధాని మోదీ అనంతరం శ్రీహరికోటలోని శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి అభినందించడం దేశ శాస్త్రవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు.
అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు మోదీ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతు వల్లే భారత్ ప్రపంచ అంతరిక్ష రంగంలో వేగంగా ఎదుగుతోందని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలకు పూర్తి స్వేచ్ఛ, పరిశోధనలకు అనుకూల వాతావరణం కల్పించడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. విక్రమ్-1 విజయం దేశాన్ని శాస్త్రసాంకేతిక రంగంలో మరింత స్వయంసమృద్ధి దిశగా తీసుకెళ్తుందని, భవిష్యత్తులో స్కైరూట్ సంస్థ మరిన్ని విజయవంతమైన ప్రయోగాలతో భారత అంతరిక్ష రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.








