Mahaa Daily Exclusive

  ఏపీ స్థానిక ఎన్నికలు ..పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి….

Share

  • ఏపీ స్థానిక ఎన్నికలు
  • పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి
  • సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
  • టీడీపీ నేత తీరుతో ముక్కున వేలేసుకున్న ఓటర్లు

సాలూరు, మహా : స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయంటే చాలు చిత్ర విచిత్రమైన ఘటనలు, పరిణామాలు చోటుచేసుకుంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో అలాంటి ఆసక్తికరమైన ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం ఇటీవల బీసీ మహిళ కు రిజర్వ్ కావడంతో రేసులో ఉన్న నేతల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. అక్కడే ట్విస్ట్ ఉంది. టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించిన నలుగురు ముఖ్య నేతల్లో ముగ్గురికి వివాహం కావటంతో వారిని పోటీలో నిలపాలని భావించారు. అయితే, పెళ్లి కాని నాలుగో నేత వైకుంఠపు హర్షవర్ధన్ తానేమీ తక్కువా అన్నట్లు పదవిపై ఆశతో రాత్రికి రాత్రే వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

ఎలాగైనా సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవాలని పెళ్లి చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నాడు. పదవి కావాలన్న తాపత్రయంతో టీడీపీ నేత హర్షవర్ధన్.. తన పక్క వార్డులోనే నివాసముంటున్న బి.టెక్ గ్రాడ్యుయేట్ అయిన గుల్లా మంజూర అనే యువతితో రాత్రికి రాత్రే మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్న ప్రకారమే తెల్లవారేసరికి సాలూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యవసరంగా వివాహం చేసుకున్నారు. రేసులో తాను నిలిచేందుకు వివాహం చేసుకోవడంతో ఇతర నేతలు షాకయ్యారు. చట్టబద్ధమైన రిజర్వేషన్ అర్హత, నామినేషన్ పత్రాల దాఖలు కోసం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రత్యేకంగా వివాహ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు.

కాగా, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆశీస్సులు సైతం హర్షవర్ధన్‌కే ఉండటంతో సాలూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకునేందుకు పెళ్లితో మాస్టర్ ప్లాన్ అమలు చేసినట్లు తెలుస్తోంది. తన భార్య గుల్లా మంజూరను బీసీ మహిళగా కౌన్సిలర్‌గా పోటీ చేయించి, మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడం లక్ష్యంగా రాత్రికి రాత్రే మాట్లాడుకుని ఉదయమే పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.