Mahaa Daily Exclusive

  చరిత్ర సృష్టించిన విక్రమ్-1….

Share

చరిత్ర సృష్టించిన విక్రమ్-1.
• స్కైరూట్ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు.
• ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీకగా ప్రశంసలు

శ్రీహరికోట,మహా.
భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంతో దేశ అంతరిక్ష రంగంలో మరో చారిత్రక అధ్యాయం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ ప్రతిష్ఠాత్మక రాకెట్ శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల సామర్థ్యానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించింది.

విక్రమ్-1 ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వీక్షించారు. రాకెట్ విజయవంతంగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వెంటనే స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ఫోన్ చేసి ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కృషిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ దేశం మొత్తం గర్వించే ఘనతను సాధించారని కొనియాడారు.

ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతమైన ప్రయోగం దేశ అంతరిక్ష రంగానికి కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరగడం వల్ల సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుందని, దేశ సాంకేతిక సామర్థ్యం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

విక్రమ్-1 విజయంతో ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పం మరోసారి సాకారమైందని ప్రధాని అభిప్రాయపడ్డారు. స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం భారత్‌కు ఉందని ఈ ప్రయోగం నిరూపించిందన్నారు. భవిష్యత్తులో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ప్రపంచ మార్కెట్లో మరింత కీలక పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.