Mahaa Daily Exclusive

  గోదావరిలో చేపల వేట విషాదం.. ఐదుగురు మృతి…..

Share

గోదావరిలో చేపల వేట విషాదం.. ఐదుగురు మృతి.
* బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ.
పోలవరం, మహా.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కలచివేసింది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీసుల వివరాల ప్రకారం, గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకె సుశీల (37), ఊకె లక్ష్మి (37), తుర్రం భారతి (40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేశ్ (38) చేపల వేట కోసం గోదావరి నదిలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు వారు గల్లంతయ్యారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలిచివేశాయి.

ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ చర్యలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు వెంటనే అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు.

గోదావరిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.