Mahaa Daily Exclusive

  ‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్’….

Share

‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్’.
* విక్రమ్-1 విజయంపై సీఎం రేవంత్ హర్షం

హైదరాబాద్, మహా.
భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్’ అంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన ఈ ఘన విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ఘనత సాధించడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.
దేశ అంతరిక్ష కలలకు తెలంగాణ చిరునామాగా మారుతోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఆవిష్కరణలు, సాంకేతిక నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఈ విజయం ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకువచ్చిందని తెలిపారు. సాంకేతిక రంగంలో తెలంగాణ యువత ప్రతిభను ప్రపంచం మరోసారి గుర్తించేలా ఈ విజయం నిలిచిందన్నారు.
విక్రమ్-1 విజయాన్ని సాకారం చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత ప్రైవేట్ స్పేస్ రంగం ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటిందని కొనియాడారు. భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు తెలంగాణ నుంచి మరిన్ని వినూత్న ఆవిష్కరణలు వెలువడాలని, అంతరిక్ష రంగంలో రాష్ట్రం మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. “విక్రమ్-1 విజయం భారత అంతరిక్ష భవిష్యత్తుకు కొత్త దిశను చూపడమే కాకుండా, తెలంగాణ నుంచి ప్రపంచాన్ని చేరుకునే సాంకేతిక శక్తికి ప్రతీకగా నిలిచింది” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.