Mahaa Daily Exclusive

  మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై భూకబ్జా కేసు.

Share

హైదరాబాద్, మహా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై శ్రీకాకుళంలో సంచలన భూకబ్జా కేసు నమోదైంది. శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, కోట్లాది రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం, శ్రీకాకుళంలోని బలగ ప్రాంతంలో సుమారు రూ.3 నుంచి రూ.4 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు నిందితులు పక్కా ప్రణాళిక రచించారు. అసలు భూ యజమాని అంధవరపు గోవిందరాజులు జీవించి ఉండగానే ఆయన మరణించినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఒడిశాకు చెందిన ఓ మహిళను గోవిందరాజులు కుమార్తెగా చూపిస్తూ, తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

రిజిస్ట్రేషన్ అనంతరం భూమికి ప్రహరీ గోడ నిర్మించే ప్రయత్నం చేయడంతో అసలు యజమానుల కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ పత్రాలు, ఫోర్జరీ, అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు ప్రస్తుత హిరమండలం సబ్‌రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో ఇప్పటికే అడబాల రజనీ, సతీష్ కుమార్ సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు సహా మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు.

అయితే ఈ కేసులో నమోదైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టులో నేరం రుజువయ్యే వరకు నిందితులు చట్టపరంగా నిర్దోషులుగానే పరిగణించబడతారు. పోలీసులు సేకరిస్తున్న ఆధారాలు, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.