Mahaa Daily Exclusive

  జైలు చుట్టూ మొసళ్ల వలయం. ఇజ్రాయెల్ సంచలన భద్రతా వ్యూహం.

Share

ఢిల్లీ, మహా.

హమాస్ ఉగ్రవాదుల బందీల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాలస్తీనా ఖైదీలు, ముఖ్యంగా హమాస్‌కు చెందిన ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు జైలు చుట్టూ మొసళ్లతో కూడిన ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ నిర్ణయానికి అనుగుణంగా ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రి ఇడిత్ సిల్మాన్ ఇటీవల కీలక మార్పులు చేశారు. ఇప్పటి వరకు “అడవి జంతువుల” జాబితాలో ఉన్న నైలు నది మొసళ్లను “బంధించి పెంచే వన్యప్రాణుల” జాబితాలోకి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భద్రతా అవసరాల కోసం ప్రభుత్వ సంస్థలు మొసళ్లను చట్టబద్ధంగా పెంచుకునే అవకాశానికి మార్గం సుగమమైంది.

వాస్తవానికి ఈ ఆలోచనను గతేడాది డిసెంబర్‌లో ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ప్రతిపాదించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న “అలిగేటర్ అల్కాట్రాజ్” ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ తరహాలో పాలస్తీనా ఖైదీలు ఉన్న జైలు చుట్టూ మొసళ్లను ఉంచి పరారిని పూర్తిగా అడ్డుకోవాలని ఆయన సూచించారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వంలోని పలువురు నాయకులు ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ముందుకు సాగలేదు. ఇప్పుడు చట్టంలో మార్పులు రావడంతో ఆయన ప్రతిపాదన అమలుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం నైలు నది మొసళ్లను భద్రతా సంస్థల ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే పెంచేందుకు అనుమతి ఉంటుంది. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తప్పించుకోకుండా ప్రకృతి, పార్కుల అథారిటీ డైరెక్టర్ నిర్దేశించిన కఠిన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలి. అంతేకాకుండా, దేశ భద్రతా అవసరాల దృష్ట్యా మొసళ్లను వినియోగించడం అవసరమేనని పర్యావరణ పరిరక్షణ మంత్రి అధికారికంగా ధృవీకరించిన తర్వాతే ఈ ఏర్పాట్లు అమల్లోకి రానున్నాయి.

ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్‌లోని కెట్జియాట్ జైలు చుట్టూ ఈ ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు పరిశీలిస్తున్నారు. 2023లో హమాస్ ఇజ్రాయెల్‌పై జరిపిన దాడుల అనంతరం పట్టుబడిన అనేక మంది హమాస్ ఉగ్రవాదులను ప్రస్తుతం ఈ జైలులోనే నిర్బంధించారు. ఈ నేపథ్యంలో వారి పరారిని పూర్తిగా అడ్డుకునేందుకు సాంకేతిక భద్రతతో పాటు సహజ రక్షణ వ్యవస్థగా మొసళ్లను వినియోగించే ప్రతిపాదనకు ప్రాధాన్యం లభిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రణాళిక అమల్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా జైలు భద్రతలో అత్యంత అసాధారణమైన, వివాదాస్పదమైన చర్యల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మానవ హక్కుల సంస్థలు, పర్యావరణ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ స్థాయిలో చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతుండగా, తుది నిర్ణయం వెలువడిన తర్వాతే ఈ ప్రాజెక్టు అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.