Mahaa Daily Exclusive

  యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.

Share

  • త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

ఢిల్లీ, మహా.

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లును త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ ఆమోదం అనంతరం మధ్యప్రదేశ్‌లో యూసీసీ అమలుకు మార్గం సుగమం కానుంది.

కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాష్ట్ర చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యూసీసీ అమలుతో మతంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. “మాకు రామ్ అయినా, రహీమ్ అయినా అందరూ సమానమే. అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ఈ బిల్లు ఉద్దేశం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం వల్ల రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగదని కూడా స్పష్టం చేశారు.

ఈ బిల్లు రూపకల్పన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, డివిజన్లలో ప్రజాభిప్రాయాలను సేకరించిన అనంతరమే కమిటీ తన నివేదిక సమర్పించిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ముస్లిం వర్గాల నుంచి కూడా మంచి స్పందన లభించిందని, ముస్లిం మహిళల్లో సుమారు 80 శాతం మంది, పురుషుల్లో 40 శాతం మంది యూసీసీకి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

భోపాల్‌లో వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక, మత సంస్థల ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నప్పటికీ, కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉందని విమర్శించారు. “ఒకే దేశం–ఒకే చట్టం అనే భావనను కాంగ్రెస్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది” అని మోహన్ యాదవ్ ఆరోపించారు.

కేబినెట్ ఆమోదం పొందిన యూసీసీ బిల్లు త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ బిల్లుకు ఆమోదం లభిస్తే, ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే మరో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచే అవకాశం ఉంది. యూసీసీపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.