• అఖిలపక్ష సమావేశంలో విపక్షాల వాకౌట్.
• కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.
ఢిల్లీ, మహా.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. ప్రతిపాదిత డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో మద్దతు లభించిందంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా ఖండించారు. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఫేక్ న్యూస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన జైరాం రమేశ్.. కొన్ని టెలివిజన్ ఛానెళ్లు డీలిమిటేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్లు ప్రసారం చేస్తున్న వార్తలు వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో అలాంటి చర్చా, ఏకాభిప్రాయం ఏదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
జులై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ శాసన ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే సమావేశం ప్రారంభంలోనే ‘నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా కి ఆహ్వానం ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిర్ణయానికి నిరసనగా విపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం కొద్దిసేపటికే తిరిగి సమావేశంలో పాల్గొన్నాయి.
ఈ అంశంపై జైరాం రమేశ్ మాట్లాడుతూ.. లోక్‌సభ స్పీకర్ వద్ద అనర్హత అంశం పెండింగ్‌లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలకు ఎన్‌సీపీఐ ఒక “పార్కింగ్ ప్లేస్”లా మారిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో చోటు కల్పించడాన్ని నిరసిస్తూ తాము వాకౌట్ చేసినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.







