Mahaa Daily Exclusive

  జన నాయగన్ విడుదలకు సర్వం సిద్ధం.

Share

  • జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.

చెన్నై , మహా.

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ నటుడిగా వీడ్కోలు పలుకుతున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జూలై 23న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 థియేటర్లలో, తమిళనాడులోనే దాదాపు 950 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఉండేందుకు నిర్మాతలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరలకే టికెట్లు విక్రయించాలని థియేటర్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే రాజకీయ విమర్శలకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో 18 ఏళ్లలోపు ప్రేక్షకులను థియేటర్లలోకి అనుమతించవద్దని చిత్రబృందం సూచించింది. సుదీర్ఘ న్యాయపోరాటం, సెన్సార్ ప్రక్రియ అనంతరం ఈ చిత్రానికి సర్టిఫికెట్ లభించింది.

కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై మంచి స్పందన లభిస్తోంది. తమిళనాడులో కూడా బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానులు భారీగా ఆసక్తి చూపుతున్నారు.

విజయ్ సినీ ప్రయాణానికి ‘జన నాయగన్’ ముగింపు పలుకుతున్న చిత్రం కావడంతో విడుదలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అభిమానుల సంబరాలు, భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని థియేటర్లు, స్థానిక అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.